Instant Soft Idli : మనం అల్పాహారంగా తీసుకునే వాటిలో ఇడ్లీలు కూడా ఒకటి. ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే ఇడ్లీలను తయారు చేసుకోవడానికి మనం ముందే పిండిని తయారు చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా పిండిని తయారు చేయడం అందరికి కుదరకపోవచ్చు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే విధంగా ఇన్ స్టాంట్ ఇడ్లీలను తయారు చేసి తీసుకోవచ్చు. పప్పు నానబెట్టిన రుబ్బే పనిలేకుండా ఇన్ స్టాంట్ గా రుచిగా, మెత్తగా ఈ ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన ఇడ్లీలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇన్ స్టాంట్ గా అప్పటికప్పుడు రుచికరమైన ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒకటింపావు కప్పు, పెరుగు – ఒక కప్పు, నీళ్లు – ముప్పావు కప్పు, నూనె – 2 టీ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, శనగపప్పు – 2 టీ స్పూన్స్, మినపప్పు – 2 టీ స్పూన్స్, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, వంటసోడా – 1/3 టీ స్పూన్స్.
ఇన్ స్టాంట్ ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో రవ్వను తీసుకోవాలి. తరువాత ఇందులో పెరుగు, నీళ్లు పోసి కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 20 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తరువాత ఈ తాళింపును రవ్వలో వేసి కలపాలి. తరువాత ఉప్పు, వంటసోడా, మరికొద్దిగా నీళ్లు పోసి కలపాలి. తరువాత ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసి మూత పెట్టి వేడి చేయాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ లను తీసుకుని వాటిలో పిండి వేసుకోవాలి. తరువాత ఈ ప్లేట్ లను ఇడ్లీ కుక్కర్ లో ఉంచి మూత పెట్టి ఉడికించాలి. వీటిని 15 నుండి 18 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారిన తరువాత ఇడ్లీలను ప్లేట్ లోకి తీసుకుని చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, మెత్తగా ఉండే ఇడ్లీలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.