Kobbari Bobbatlu : మనం ఇంట్లో తయారు చేసుకునే రకరకాల తీపి వంటకాల్లో బొబ్బట్లు కూడా ఒకటి. బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని రుచి చూడని వారు, వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ బొబ్బట్లను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో కొబ్బరి బొబ్బట్లు కూడా ఒకటి.ఈ బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. బొబ్బట్లు అనగానే చాలా మంది శ్రమతో, సమయంతో కూడిన పని అని భావిస్తారు కానీ ఈ బొబ్బట్లను మనం అరగంటలో తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా, రుచిగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉండే ఈ కొబ్బరి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి బొబ్బట్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒక కప్పు, పసుపు – చిటికెడు, ఉప్పు – కొద్దిగా, బెల్లం తురుము – ఒక కప్పు, పచ్చి కొబ్బరి పొడి -ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి -ఒక టీ స్పూన్.
కొబ్బరి బొబ్బట్ల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే మెత్తగా కలుపుకోవాలి. తరువాత 2 టీ స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో బెల్లం తురుము వేసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత కొబ్బరి పొడి వేసి కలపాలి. తరువాత దీనిని కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించాలి. కొబ్బరి మిశ్రమం దగ్గర పడగానే యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ముందుగా కలిపిన మైదాపిండిని నిమ్మకాయంత పరిమాణంలో తీసుకుని నెయ్యి రాసుకుంటూ చెక్క అప్పలాగా వెడల్పుగా వత్తుకోవాలి.
తరువాత ఇందులో కొబ్బరి మిశ్రమాన్ని ఉంచి అంచులను మూసేసి ఉండలా చేసుకోవాలి. తరువాత దీనిని పాలిథిన్ కవర్ పై ఉంచి చేత్తో బొబ్బట్ల ఆకారంలో వత్తుకోవాలి. చేత్తో వత్తడం రాని వారు పూరీ ప్రెస్ సహాయంతో కరూడా బొబ్బట్లను వత్తుకోవచ్చు. బొబ్బట్లను వత్తుకున్న తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక దానిపై నెయ్యి వేసి బొబ్బట్టును వేసుకోవాలి. ఈ బొబ్బట్లను నెయ్యి వేస్తూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి బొబ్బట్లు తయారవుతాయి. తీపి తినాలనిపించినప్పుడు కొబ్బరితో ఇలా రుచిగా, మెత్తగా ఉండే బొబ్బట్లను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.