Kothimeera Nilva Pachadi : మనం వంటల్లో గార్నిష్ కోసం చివరగా కొత్తిమీరను చల్లుతూ ఉంటాము. కొత్తిమీర వేయడం వల్ల వంటలు చక్కటి వాసన రావడంతో పాటుగా కొత్తిమీర మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కొత్తిమీరను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వంటల్లో వాడడంతో పాటు కొత్తిమీరతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ పచ్చడి నిల్వ కూడా ఉంటుంది. అన్నం, అల్పాహారాలతో ఈ పచ్చడిని తింటే చాలా రుచిగా ఉంటుంది. పచ్చడి పెట్టడం రాని వారు కూడా ఈ పచ్చడిని సులభంగా తయారు చేయవచ్చు. ఎంతో కమ్మగా, కమ్మటి వాసనతో ఉండే ఈ కొత్తిమీరనిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తిమీర నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నాటు కొత్తిమీర – పావుకిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, మెంతులు – పావు టీ స్పూన్, ఆవాలు – 2 టేబుల్ స్పూన్స్, నానబెట్టిన చింతపండు – 50 గ్రా., పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – పావు కప్పు, కారం -అర కప్పు, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 15.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – పావు కప్పు, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ.
కొత్తిమీర నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కొత్తిమీర శుభ్రం చేసుకుని వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. తరువాత దీనిని పొడి వస్త్రంపై వేసి ఫ్యాన్ గాలికి రాత్రంతా ఆరబెట్టాలి. ఇలా పూర్తిగా ఆరిపోయిన కొత్తిమీరను కళాయిలో కొద్ది కొద్దిగా వేస్తూ నూనె వేస్తూ వేయించాలి. కొత్తిమీరను మాడిపోకుండా చక్కగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో చింతపండు గుజ్జు వేసి ఉడికించాలి. దీనిలో ఉండే నీరంతా పోయి చింతపండు గుజ్జు దగ్గర పడే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత పసుపు వేసి కలిపి మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మరో కళాయిలో మెంతులు, ఆవాలు వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని పొడిగా చేసుకోవాలి.
అలాగే తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వేయించిన కొత్తిమీరను తీసుకోవాలి. తరువాత ఇందులో మెంతిపొడి, చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి. తరువాత తాళింపు వేసి కలపాలి. అంతే ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర పచ్చడి తయారవుతుంది. దీనిని గాజు సీసాలో ఉంచి ఒక రోజంతా ఊరిన తరువాత సర్వ్ చేసుకోవాలి. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన కొత్తిమీర పచ్చడిని అందరూ లొట్టలేసుకుంటూ తింటారు.