Lemon Candy : లెమన్ ఐస్ క్రీమ్.. నిమ్మరసంతో చేసే ఈ ఐస్ క్రీమ్ చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ దీనిని ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. మనకు బయట లభించే ఐస్ క్రీమ్స్ కంటే ఈ ఐస్ క్రీమ్ మరింత రుచిగా, రిఫ్రెషింగ్ గా ఉంటుందని చెప్పవచ్చు. ఇంట్లో పార్టీలు జరిగినప్పుడు, చల్ల చల్లగా తినాలనిపించినప్పుడు ఈ ఐస్ క్రీమ్ ను తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. ఎంతో రుచిగా, అందరికి నచ్చే ఈ లెమన్ ఐస్ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లెమన్ ఐస్ క్రీమ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నిమ్మకాయ – 1, నీళ్లు – 250 ఎమ్ ఎల్, పంచదార – పావు కప్పు, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూన్, పుదీనా – పిడికెడు, నిమ్మరసం – 3 టేబుల్ స్పూన్స్, బ్లాక్ సాల్ట్ – అర టీ స్పూన్, పసుపు లేదా ఫుడ్ కలర్ – పావు టీ స్పూన్.
లెమన్ ఐస్ క్రీమ్ తయారీ విధానం..
ముందుగా నిమ్మకాయ తొక్కను పావు టీ స్పూన్ మోతాదులో తురిమి తీసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పంచదార, నీళ్లు, నిమ్మకాయ తొక్క తురుము వేసి వేడి చేయాలి. పంచదార కరిగిన తరువాత అర కప్పు నీటిలో కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలిపి వేసుకోవాలి. దీనిని మరో 2 నుండి 3 నిమిషాల పాటు మరిగించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ పంచదార మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత ఒక జార్ లో పుదీనా ఆకులు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను చల్లారిన తరువాత పంచదార మిశ్రమంలో వేసి కలపాలి. తరువాత నిమ్మరసం, పసుపు, బ్లాక్ సాల్ట్ వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడకట్టి కుల్ఫీ మౌల్డ్స్ లోకి తీసుకోవాలి. తరువాత దీనిపై అల్యూమినియం ఫాయిల్ ని ఉంచి దానికి చిన్న రంధ్రం చేసి స్టిక్ ను ఉంచాలి.
కుల్ఫీ మౌల్డ్స్ లేని వారు టీ గ్లాసులను ఉపయోగించవచ్చు. అలాగే అల్యూమినియం ఫాయిల్ కు బదులుగా ప్లాస్టిక్ కవర్ ను ఉంచి రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు. ఇలా అన్నింటిని సిద్దం చేసుకున్న తరువాత వీటిని 7 నుండి 8 గంటల పాటు లేదా ఒక రాత్రంతా డీ ఫ్రిజ్ లో ఉంచాలి. తరువాత వీటిని బయటకు తీసి నెమ్మదిగా మౌల్డ్స్ నుండి వేరు చేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే లెమన్ ఐస్ క్రీమ్ తయారవుతుంది. దీనిని పిల్లలతో పాటు ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఇంట్లోనే చాలా సులభంగా లెమన్ ఐస్ క్రీమ్ ను తయారు చేసి తీసుకోవచ్చు.