మనం అల్పాహారంలో భాగంగా ఇడ్లీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఇడ్లీలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి సాంబార్. ఇడ్లీలను సాంబార్ లో వేసుకుని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. సాంబార్, ఇడ్లీలను కలిపి తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. హోటల్స్ లో లభించే విధంగా ఇడ్లీలను తినడానికి సాంబార్ ను ఎలా తయారు చేసుకోవాలి.. సాంబార్ తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హోటల్ స్టైల్ సాంబార్ తయారీకి కావల్సిన పదార్థాలు..
సాంబార్ పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – ఒక టేబుల్ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒకటిన్నర టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – 1 (ఒక ఇంచు ముక్క), జీలకర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, బియ్యం – అర టేబుల్ స్పూన్, ఎండు మిరపకాయలు – 6 నుండి 8, కరివేపాకు – రెండు రెబ్బలు, ఇంగువ – పావు టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్.
సాంబార్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – నాలుగున్నర కప్పులు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 3, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, తరిగిన పచ్చి మిర్చి – 2, తరిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, ఎండు మిర్చి – 1, కరివేపాకు – ఒక రెబ్బ, పెద్దగా తరిగిన టమాట – 1, తరిగిన మునక్కాయ – 1, తరిగిన క్యారెట్ – 1, చిక్కని చింతపండు గుజ్జు – అర కప్పు, పచ్చికొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూన్, బెల్లం తురుము – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
హోటల్ స్టైల్ సాంబార్ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో కందిపప్పును వేసి శుభ్రంగా కడిగి కొద్దిగా పసుపును, ఒకటిన్నర కప్పు నీళ్లను పోసి అరగంట పాటు నానబెట్టాలి. తరువాత ఇందులోనే అర టీ స్పూన్ నూనెను వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత ఒక కళాయిలో కందిపప్పును, శనగపప్పును, మినప పప్పును వేసి చిన్న మంటపై వేయించాలి. తరువాత ధనియాలను, మిరియాలను వేసి వేయించాలి. తరువాత దాల్చిన చెక్కను, జీలకర్రను, ఆవాలను, మెంతులను, బియ్యాన్ని వేసి వేయించాలి.
తరువాత ఎండు మిరపకాయలను, కరివేపాకును వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులోనే ఇంగువను, పసుపును కూడా వేసి దినుసులన్నీ చల్లగా అయ్యే వరకు ఉంచి జార్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిని వీలైనంత మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సాంబార్ పొడి తయారవుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో నూనెను వేసి నూనె కాగిన తరువాత కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత పచ్చి మిర్చిని, ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. తరువాత కూరగాయ ముక్కలను వేసి 3 నిమిషాల పాటు వేయించాలి.
తరువాత తగినంత ఉప్పును వేసి కలిపి మూత పెట్టి కూరగాయ ముక్కలను 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఒక కప్పు నీళ్లను పోసి కలిపి మూత పెట్టి కూరగాయ ముక్కలను పూర్తిగా ఉడికించాలి. తరువాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న సాంబార్ పొడిని ఒకటిన్నర టేబుల్ స్పూన్ మోతాదులో వేసి కలపాలి. తరువాత చింతపండు గుజ్జును వేసి కలిపి 2 నిమిషాల పాటు ఉడికించాలి.
తరువాత ఉడికించిన కందిపప్పును, నీళ్లను పోసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. తరువాత పచ్చి కొబ్బరి తురుమును, బెల్లం తురుమును వేసి కలిపి సాంబార్ ను ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా హోటల్స్ లో దొరికే విధంగా ఉండే సాంబార్ తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న సాంబార్ లో ఇడ్లీలను వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.