చ‌పాతీల్లో ఆలూ కుర్మా ఇలా చేస్తే.. రుచి అదిరిపోతుంది..

మ‌నం వంటింట్లో విరివిరిగా ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప‌లు కూడా ఒక‌టి. వీటిని మ‌నం త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. బంగాళాదుంప‌ల‌తో మ‌నం ఎన్నో ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా బంగాళాదుంప‌ల‌తో కుర్మాను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ కుర్మా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మ‌ధ్య‌స్థంగా త‌రిగిన బంగాళాదుంప ముక్క‌లు – రెండు క‌ప్పులు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ల‌వంగాలు – 2, యాల‌కులు – 2, దాల్చిన చెక్క ముక్క – 1, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 2, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ఒక క‌ప్పు, క‌రివేపాకు – ఒర రెబ్బ‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – పావు టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ట‌మాట ముక్క‌లు – అర‌ క‌ప్పు, నీళ్లు – ఒక‌టిన్న‌ర క‌ప్పు, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

make alu kurma in this way it is good for chapati

ఆలూ కుర్మా త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత మ‌సాలా దినుసుల‌ను వేసి వేయించుకోవాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్క‌ల‌ను రంగు మారే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ఉప్పు, ప‌సుపు, కారం, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌ల‌ను వేసి క‌లిపి మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి.

త‌రువాత బంగాళాదుంప ముక్క‌ల‌ను వేసి క‌లిపి మూత పెట్టి 3 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి బంగాళాదుంప‌ల‌ను మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. బంగాళాదుంప ముక్క‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత గ‌రం మ‌సాలాను వేసి క‌లిపి ఒక నిమిషం పాటు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ కుర్మా త‌యార‌వుతుంది. ఇలా త‌యారు చేసుకున్న ఆలూ కుర్మా కూర‌ను అన్నం, చ‌పాతీ, పుల్కా, రోటి, పులావ్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా త‌యారు చేసిన ఆలూ కుర్మా కూర‌ను అంద‌రూ ఇష్టంగా తింటారు.

D

Recent Posts