బందరు హ‌ల్వాను ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..

తీపి ప‌దార్థాల‌ను ఇష్ట‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. తీపి ప‌దార్థాల్లో బంద‌ర్ హ‌ల్వాకు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. బంద‌ర్ హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. బంద‌రు హ‌ల్వాను ఇష్టంగా తినే వారు కూడా ఉంటారు. ఈ హ‌ల్వా మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా దొరుకుతూ ఉంటుంది. చేయ‌డానికి ఓపిక ఉండాలే కానీ దీనిని మనం చాలా సుల‌భంగా ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో బంద‌రు హ‌ల్వాను రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బంద‌రు హ‌ల్వా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గోధుమ పిండి – ఒక క‌ప్పు, నీళ్లు – నాలుగు క‌ప్పులు, పంచ‌దార – ఒక‌టింపావు క‌ప్పు, నెయ్యి – అర క‌ప్పు, త‌రిగిన జీడిప‌ప్పు – కొద్దిగా, యాల‌కుల పొడి – అర టీ స్పూన్.

here it is how you can make bandaru halwa

బంద‌రు హ‌ల్వా త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకుని దానిలో అర క‌ప్పు నీళ్ల‌ను పోసుకుంటూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ పిండిని తీసుకుని ఒకే ప‌రిమాణంలో ఉండే నాలుగైదు ముద్ద‌లుగా చేసుకోవాలి. త‌రువాత ఈ చ‌పాతీ ముద్ద‌ల‌పై నీళ్ల‌ను పోసి రెండు నుండి మూడు గంట‌ల పాటు నాన‌బెట్టాలి. ఇలా నాన‌బెట్టిన తరువాత నీళ్లు, పిండి ముద్ద‌లు అన్నీ క‌లిసేలా బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ నీటిని చాలా చిన్న రంధ్రాలు ఉన్న జ‌ల్లిగంటెను తీసుకుని వ‌డ‌క‌ట్టాలి.

వ‌డ‌క‌ట్ట‌గా జ‌ల్లిగంటెలో పేరుకుపోయిన గోధుమ పిండిని పూర్తిగా పిండి నీళ్లు లేకుండా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల గోధుమ పిండి నీళ్ల నుండి వేర‌వుతుంది. ఇలా వ‌డ‌క‌ట్ట‌గా వ‌చ్చిన నీటిని ఒక గంట పాటు క‌దిలించ‌కుండా ఉంచాలి. ఇలా క‌దిలించ‌కుండా ఉంచ‌డం వ‌ల్ల గిన్నె అడుగు భాగంలో తెల్లని రంగులో పాలు, పై భాగంలో నీళ్లు పేరుకుపోతాయి. పైన పేరుకున్న నీటిని పారబోసి అడుగు భాగంలో పేరుకుపోయిన పాల‌ను ఒక‌సారి క‌లిపి ప‌క్క‌న‌ ఉంచాలి.

త‌రువాత అడుగు భాగం మందంగా లోతుగా ఉండే క‌ళాయిని తీసుకుని అందులో ఒక క‌ప్పు పంచ‌దార‌ను, పావుక‌ప్పు నీళ్ల‌ను పోసి పంచ‌దార క‌రిగే వ‌ర‌కు క‌లుపుతూ ఉండాలి. పంచ‌దార క‌రిగే లోపు మ‌రో స్ట‌వ్ మీద క‌ళాయిని ఉంచి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక జీడిప‌ప్పు ప‌లుకుల‌ను వేడి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో పావు క‌ప్పు పంచ‌దార‌ను వేసి పంచ‌దార క‌రిగి రంగు మారే వ‌ర‌కు క‌లుపుతూ చిన్న మంట‌పై వేడి చేయాలి.

ఇప్పుడు ముందుగా క‌ళాయిలో వేసిన పంచ‌దార క‌రిగిన త‌రువాత అందులో ముందుగా త‌యారు చేసి పెట్టుకున్న పాల‌ను పోసి ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు క‌లుపుతూ ఉండాలి. ఈ మిశ్ర‌మం ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత రంగు మారేలా వేడి చేసిన పంచ‌దార మిశ్రమాన్ని వేసి క‌ల‌పాలి. ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని 20 నుండి 30 నిమిషాల పాటు మ‌ధ్య మ‌ధ్య‌లో నెయ్యిని వేస్తూ అడుగు భాగం మాడ‌కుండా క‌లుపుతూ ఉండాలి.

హ‌ల్వా క‌ళాయికి అంటుకోకుండా వేరైన త‌రువాత అందులో ముందుగా వేయించిన జీడిప‌ప్పును, యాల‌కుల పొడిని వేసి క‌లిపి ఒక నిమిషం పాటు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ హ‌ల్వాను నేరుగా ఇదే విధంగా తిన‌వ‌చ్చు లేదా 2 గంట‌ల పాటు ఫ్రిజ్ లోఉంచి గ‌ట్టి ప‌డిన త‌రువాత ముక్క‌లుగా చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బంద‌ర్ హ‌ల్వా తయారవుతుంది. ఇలా త‌యారు చేసిన బంద‌ర్ హ‌ల్వాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts