Masala Gutti Vankaya Fry : మనం రకరకాల కూరగాయలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇలా ఆహారంగా తీసుకునే కూరగాయలలో వంకాయలు ఒకటి. వంకాయలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనకు శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. బరువు తగ్గడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో.. వంకాయలు ఎంతో సహాయపడతాయి. ఇక మనకు వివిధ రకాల వంకాయలు లభిస్తూ ఉంటాయి. వాటిలో గుండ్రటి వంకాయలు కూడా ఒకటి. వీటిని ఉపయోగించి చేసే గుత్తి వంకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ వంకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే మసాలా గుత్తి వంకాయ ఫ్రై ను కూడా చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే మసాలా గుత్తి వంకాయ ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా గుత్తి వంకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
గుత్తి వంకాయలు – అర కిలో, నూనె – 4 టేబుల్ స్పూన్స్, శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్, మినప పప్పు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒకటిన్నర టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి ముక్కలు – రెండు టేబుల్ స్పూన్స్, ఎండు మిరప కాయలు – 10, వెల్లుల్లి రెబ్బలు – 10, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, మిరియాలు – 10, ఉప్పు – రుచికి సరిపడా.
మసాలా గుత్తి వంకాయ ఫ్రై తయారీ విధానం..
ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి తొడిమను పూర్తిగా తీయకుండా నాలుగు భాగాలుగా చేసి ఉప్పు నీటిలో వేయాలి. తరువాత ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగాక శనగపప్పు, మినపపప్పు, మెంతులు, మిరియాలు వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. 2 నిమిషాల తరువాత పల్లీలు, జీలకర్రను కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిక తరువాత ధనియాలను, ఎండు మిరప కాయలను వేసి వేయించి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత మరో కళాయిలో నూనె వేసి తరిగిన వంకాయలను వేసి పూర్తిగా వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లగా అయ్యే వరకు ఉంచాలి.
ఇప్పుడు ఒక జార్ లో ముందుగా వేయించిన ఎండు మిరపకాయల మిశ్రమంతోపాటు ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పును వేసి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలలో మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఉంచాలి. ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగాక మసాలా మిశ్రమాన్ని ఉంచిన వంకాయలను అందులో వేయాలి. మిగిలిన మసాలా మిశ్రమాన్ని కూడా వంకాయలపై వేసి 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా గుత్తి వంకాయ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నంతో నేరుగా లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.