Tomato Pachi Mirchi Pachadi : ట‌మాటా ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల ప‌చ్చ‌డి.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!

Tomato Pachi Mirchi Pachadi : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చాలా మందికి అన్నం తినేట‌ప్పుడు ఏదో ఒక ర‌క‌మైన ప‌చ్చ‌డి ఉండాల్సిందే. నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేసుకునే వీలు అంద‌రికీ ఉండ‌దు. క‌నుక‌ చాలా సులువుగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో అప్ప‌టిక‌ప్పుడు అయ్యే ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేసుకుని తింటుంటారు. అయితే ఇలాంటి ప‌చ్చ‌ళ్ల‌లో మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది.. ట‌మాట ప‌చ్చి మిర‌ప‌కాయ ప‌చ్చ‌డి.. అని చెప్ప‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు.. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే దీన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Tomato Pachi Mirchi Pachadi is very tasty if you cook like this
Tomato Pachi Mirchi Pachadi

ట‌మాట ప‌చ్చి మిర్చి ప‌చ్చ‌డి త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

ట‌మాటాలు – 6 (మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), ప‌చ్చి మిరప‌కాయ‌లు – 15 నుండి 20, పెద్ద‌గా త‌రిగిన‌ ఉల్లిపాయ – 1, వెల్లుల్లి రెబ్బ‌లు – 10, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ప‌చ్చి చింత‌కాయ ప‌చ్చ‌డి – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – రుచికి త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్.

ట‌మాట ప‌చ్చి మిర్చి ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా ట‌మాటాల‌ను శుభ్రంగా క‌డిగి నాలుగు ముక్క‌లుగా చేసుకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగాక ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు వేసి 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. త‌రువాత ట‌మాటాలు, ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేసి క‌లిపి మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై ట‌మాటాలు పూర్తిగా ఉడికే వ‌ర‌కు ఉంచి.. స్ట‌వ్ ఆఫ్ చేసి ట‌మాటాలు పూర్తిగా చ‌ల్లారే వ‌ర‌కు ప‌క్క‌న‌ పెట్టుకోవాలి.

ఇవి చల్లారిన త‌రువాత ఒక జార్ లో వేయాలి. వీటితోపాటు వెల్లుల్లి రెబ్బ‌లు, త‌రిగిన కొత్తిమీర‌, ప‌చ్చి చింత‌కాయ ప‌చ్చ‌డి, రుచికి త‌గినంత ఉప్పును వేసి క‌చ్చాప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి కాగాక జీల‌క‌ర్ర‌, ఆవాలు, క‌రివేపాకు వేసి వేయించి ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చ‌డిలో వేసి క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ట‌మాట ప‌చ్చి మిర్చి ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. ఈ ప‌చ్చ‌డి త‌యారీలో ప‌చ్చి చింత‌కాయ ప‌చ్చ‌డికి బ‌దులుగా చింత‌పండును కూడా వాడ‌వ‌చ్చు. ట‌మాటాల‌ను జార్ లో వేసి మిక్సీ ప‌ట్టుకోవ‌డం కంటే రోట్లో వేసి దంచితే ఇంకా రుచిగా ఉంటుంది. దీనిని అన్నం, దోశ‌, ఇడ్లీ, ఊత‌ప్పం, పొంగ‌ల్ వంటి వాటితో క‌లిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

D

Recent Posts