Masala Pappu : మ‌సాలా ప‌ప్పును ఇలా చేయండి.. అన్నంలో నెయ్యితో క‌లిపి వేడిగా తింటే ఎంతో బాగుంటుంది..!

Masala Pappu : మ‌నం వంటింట్లో వివిధ ర‌కాల ప‌ప్పు కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌ప్పు కూర‌లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. అయితే త‌రుచూ ఒకేర‌కం ప‌ప్పు కూర‌లు కాకుండా మ‌నం ఎక్కువ‌గా తీసుకునే కందిప‌ప్పుతో ఎంతో రుచిగా ఉండే మ‌సాలా ప‌ప్పును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ ప‌ప్పును త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఒక్క‌సారి రుచి చూస్తే చాలు మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే ప‌ప్పు చేయ‌మ‌ని అడ‌గ‌క త‌ప్ప‌రు. ఎంతో రుచిగా ఉండే ఈ మ‌సాలా ప‌ప్పును సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌సాలా ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన కందిప‌ప్పు – ఒక క‌ప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీస్పూన్, వెల్లుల్లి రెబ్బ‌లు- 7 లేదా 8, త‌రిగిన ఉల్లిపాయ – 1, ప‌సుపు – పావు టీ స్పూన్, నీళ్లు – రెండున్న‌ర గ్లాసులు, కారం – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్.

Masala Pappu recipe in telugu make in this method
Masala Pappu

మ‌సాలా ప‌ప్పు త‌యారీ విధానం..

ముందుగా పప్పును క‌డిగి నాన‌బెట్టాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌బడిన త‌రువాత కందిప‌ప్పు వేసి క‌ల‌పాలి. దీనిని 3 నిమిషాల పాటు వేయించిన త‌రువాత ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌లపాలి. ఇప్పుడు ప‌ప్పుపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ 80 శాతం ఉడికించాలి. అవ‌స‌ర‌మైతే మ‌రికొన్ని నీటిని పోసుకుని ఉడికించాలి. త‌రువాత ఉప్పు, కారం వేసి క‌ల‌పాలి. ఇప్పుడు మ‌ర‌లా మూత పెట్టి పప్పును మెత్త‌గా ఉడికించుకోవాలి. చివ‌ర‌గా ధ‌నియాల పొడి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌సాలా ప‌ప్పు త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ మ‌సాలా ప‌ప్పును ఇంట్లో అంద‌రూ లొట్ట‌లేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts