Nimmakaya Karam : నిమ్మకాయలు మన ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా మెరుగుపరుచుకోవడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో, బరువు తగ్గడంలో, రక్తహీనత రాకుండా చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక విధాలుగా నిమ్మకాయలు మనకు ఉపయోగపడతాయి. నిమ్మకాయలను మనం విరివిరిగా వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. వంటల్లో ఉపయోగించడంతో పాటు నిమ్మకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే కారాన్ని తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయలతో చేసే ఈ కారం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం సులభమే కాకుండా అంత ఎక్కువగా సమయం కూడా పట్టదు. ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
నిమ్మకాయలు – 8, ఎండుమిర్చి – 10, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, మినపప్పు – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 2, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
నిమ్మకాయ కారం తయారీ విధానం..
ముందుగా నిమ్మకాయలను కట్ చేసి వాటి నుండి రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. దినుసులు చక్కగా వేగిన తరువాత ఎండుమిర్చి, నువ్వులు వేసి వేయించాలి. ఎండుమిర్చి చక్కగా వేగిన తరువాత వీటన్నింటిని ఒక జార్ లోకి తీసుకోవాలి.తరువాత ఇందులోనే ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ కారం పొడిలో నిమ్మరసాన్ని వేసి కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న కారం పొడిలో వేసి కలపాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ కారం తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా నిమ్మకాయ కారాన్ని తయారు చేసుకుని తినవచ్చు. ఈ కారాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.