Chamadumpala Pulusu : మనం ఆహారంగా తీసుకునే దుంపజాతికి చెందిన కూరగాయల్లో చామదుంపలు కూడా ఒకటి. చామదుంపలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. చామదుంపలతో మనం ఎక్కువగా పులుసును తయారు చేస్తూ ఉంటాం. చామదుంపలతో చేసిన పులుసును చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ పులుసును రుచిగా, అందరూ ఇష్టపడేలా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చామదుంప పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన చామదుంపలు – అరకిలో, తరిగిన పచ్చిమిర్చి – 2, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2, బెల్లం – ఒక చిన్న ముక్క, నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, శనగపిండి – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, మెంతులు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఇంగువ – పావు టీ స్పూన్.
చామదుంపల పులుసు తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత ఉడికించిన చామ దుంపలు, పసుపు, కారం, ఉప్పు, శనగపిండి వేసి కలపాలి. ఇలా కలిపిన తరువాత చింతపండు రసం, బెల్లం, ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చామదుంప పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చామదుంపలతో ఈ విధంగా పులుసును తయారు చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతో పాటు చామదుంపల వల్ల కలిగే ప్రయోజనాలను కూడా పొందవచ్చు.