Semiya Idli : రోజూ ఒకేరకం అల్పాహారాలు తిని తిని బోర్ కొట్టిందా… అయితే కింద చెప్పిన ఈ అల్పాహారాన్ని మీరు ఖచ్చితంగా రుచి చూడాల్సిందే. సేమియాతో చేసే ఈ వెరైటీ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని అప్పటికప్పుడు ఇన్ స్టాంట్ గా తయారు చేసుకోవచ్చు. పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా చాలా తక్కువ సమయంలో ఈ ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్న వారు ఇలా సేమియాతో ఇడ్లీలను తయారు చేసుకుని తినవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ సేమియా ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సేమియా ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, సేమియా – ఒక కప్పు, పెరుగు – అర కప్పు, బొంబాయి రవ్వ – రెండు టేబుల్ స్పూన్స్, క్యారెట్ తురుము – అర కప్పు, అల్లం తరుగు – అరటీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.
సేమియా ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, శనగపప్పు వేసి వేయించాలి. తరువాత సేమియా వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఒక గిన్నెలో పెరుగును తీసుకుని ఉండలు లేకుండా చిలకాలి. తరువాత ఇందులో రవ్వ, క్యారెట్ తురుము, అల్లం తరుగు, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర వేసి కలపాలి. తరువాత అర కప్పు నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు వేయించిన సేమ్యా వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి అరగంట పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ లను తీసుకుని వాటికి నూనెను రాయాలి. తరువాత సేమియా మిశ్రమాన్ని తీసుకుని పలుచగా ఇడ్లీల వలె వేసుకోవాలి.
తరువాత ఈ ప్లేట్ లను ఇడ్లీ కుక్కర్ లో ఉంచి 8 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై 4నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇడ్లీలను బయటకు తీసి కొద్దిగా చల్లారిన తరువాత ప్లేట్ లో వేసుకుని అల్లం చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సేమియా ఇడ్లీలు తయారవుతాయి. ఈ విధంగా తయారు చేసిన ఇడ్లీలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. తరుచూ ఒకేరకం ఇడ్లీలు కాకుండా ఇలా అప్పటికప్పుడు సేమియాతో రుచికరమైన మెత్తని ఇడ్లీలను తయారు చేసుకుని తినవచ్చు.