Shanagala Patoli : ఎర్ర శనగలను కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. శనగలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లతో పాటు, క్యాల్షియం, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ శనగలతో గుగ్గిళ్లు, కూర వంటి వాటినేకాకుండా మనం ఎంతో రుచిగా ఉండే పాటోలిని కూడా తయారు చేసుకోవచ్చు. శనగల పాటోలి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండే శనగల పాటోలిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శనగల పాటోలి తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన శనగలు – ఒక కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు -అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 3, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్.
శనగల పాటోలి తయారీ విధానం..
ముందుగా శనగలను 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత వీటిని నీళ్లు లేకుండా వడకట్టుకుని ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ శనగలను మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న శనగలను వేసి కలపాలి. తరువాత మూత పెట్టి పచ్చి వాసన పోయే వరకు మగ్గించాలి.
శనగల మిశ్రమం పచ్చి వాసన పోయిన తరువాత కారం వేసి కలపాలి. దీనిని మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగల పాటోలి తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. శనగలతో తరచూ చేసే వాటితో పాటు అప్పుడప్పుడూ ఇలా పాటోలిని కూడా తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా శనగలతో పాటోలిని తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు.