Rowan Berries : మనం ఆహారంగా తీసుకోదగిన పండ్లల్లో రోవాన్ బెర్రీలు కూడా ఒకటి. ఈ బెర్రీలు ఆపిల్ కుటుంబానికి చెందినవి. హియాలయాల్లో, పశ్చిమ చైనా, దక్షిణ టిబెట్, చల్లని సమశీతోష్ణ ప్రాంతాల్లో ఈ రోవన్ బెర్రీ చెట్టు ఎక్కువగా పెరుగుతాయి. ఈ మొక్కను కలప కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ రోవాన్ బెర్రీలను శీతాకాలంలో ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. రోవాన్ బెర్రీలల్లో విటమిన్ సి, సోర్బిక్ ఆమ్లం, ఫైబర్, టానిన్లు, ఆంథోసైనిన్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం పలు రకాల క్యాన్సర్ ల బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
అలాగే రోవాన్ బెర్రీలను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కళ్లకు సంబంధించిన వివిధ రకాల సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అలాగే చర్మాన్ని సంరక్షించడంలో, జీర్ణ సంబంధిత సమస్యలైనా గ్యాస్, మలబద్దకం, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో, జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో ఈ పండ్లు మనకు సహాయపడతాయి. అంతేకాకుండా స్త్రీలు ఈ రోవాన్ బెర్రీలను తినడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
ఈ పండ్లను తినడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి. కేవలం పండ్లే కాకుండా ఈ చెట్టు ఆకులు, బెరడు కూడా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఈ రోవాన్ బెర్రీలు మనకు డ్రై ఫ్రూట్ రూపంలో కూడా మార్కెట్ లో లభిస్తాయి. కనుక వీటిని కొనుగోలు చేసి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.