Black Horse Gram : ఉలవలు..ఇవి మనందరికి తెలిసినవే. వీటిని గుర్రాలకు ఎక్కువగా ఆహారంగా ఇస్తూ ఉంటారు. అలాగే ఈ ఉలవలతో ఎక్కువగా చారును, గుగ్గిళ్లను తయారు చేసుకుని మనం కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఉలవలను కూడా తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవాలని వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉలవల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. 100 గ్రాముల ఉలవల్లో 329 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. అలాగే వీటిలో 57 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 0.6 గ్రాముల ఫ్యాట్, 22 గ్రాముల ప్రోటీన్, 8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అలాగే ఉలవల్లో ఇనులిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది.
ఇది కణజాలాల్లో ఉండే మైటోకాండ్రియాను ఉత్తేజపరుస్తుంది. దీంతో శక్తి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఉలవల్లో ఉండే శక్తి తక్కువగా ఉన్నప్పటికి వీటిలో ఉండే రసాయన సమ్మేళనాల కారణంగా శరీరంలో శక్తి ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే షుగర్ వ్యాధితో బాధపడే వారికి ఇవి ఒక చక్కటి ఆహారమని నిపుణులు చెబుతున్నారు. షుగర్ వ్యాధితో బాధపడే వారు అలాగే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలనుకునే వారు ఉలవలను ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఉలవల్లో ఉండే రసాయన సమ్మేళనాలు బీటా కణాలు ఇన్సులిన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేసేలా ప్రేరేపించడంలో సహాయపడతాయి.
అలాగే వీటిలో ఉండే డోలిచిన్ ఎ అండ్ బి అనే రసాయన సమ్మేళనం ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి రక్తంలో ఉండే చక్కెర కణాల్లోకి వెళ్లేలా చేయడంలో దోహదపడతాయి. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో ఈ విధంగా ఉలవలు మనకు సహాయపడతాయి. కనుక షుగర్ వ్యాధి గ్రస్తులు ఉలవలను ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే ఈ ఉలవల్లో ఉండే కార్బోహైడ్రేట్స్ స్టార్చ్ రూపంలో ఉంటాయి. కనుక వీటిని తీసుకున్నప్పటికి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. అదే విధంగా ఈ ఉలవల్లో ఉండే ఫైబర్ మనం తిన్న ఆహారాల ద్వారా వచ్చే చక్కెర వెంటనే రక్తంలో కలిసి షుగర్ స్థాయిలు పెరగకుండా అడ్డుకోవడంలో దోహదపడుతుంది.
ఈ విధంగా ఉలవలు షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడతాయి కనుక షుగర్ వ్యాధి గ్రస్తులు వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటిని తీసుకోవడం వల్ల భవిష్యత్తుల్లో షుగర్ వ్యాధి రాకుండా ఉంటుందని వారు తెలియజేస్తున్నారు. ఉలవలను ఉడికించి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, సైంధవ లవణం చల్లుకుని తినవచ్చు. వీటిని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఆహారంగా తీసుకోవచ్చు. అలాగే ఉలవలను మొలకలు కట్టుకుని కూడా తినవచ్చు. ఈ విధంగా ఉలవలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని కూడా తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.