Sorakaya Kobbari Pala Kura : సొరకాయ కొబ్బరి పాల కూర.. సొరకాయలు, కొబ్బరి పాలు కలిపి చేసేఈ కూర చాలా కమ్మగా ఉంటుంది. ఈ కూరను తీసుకోవడం శరీరానికి చలువ చేస్తుంది. అరికాళ్లల్లో మంటలు, కడుపులో మంట, వేడి వంటి సమస్యలతో బాధపడే వారు ఈ కూరను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ కూరను తయారు చేయడం చాలా సులభం. కమ్మగా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే సొరకాయ కొబ్బరి పాలకూరను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ కొబ్బరి పాల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు -అర కప్పు, నీళ్లు – 200 ఎమ్ ఎల్, లేత సొరకాయ ముక్కలు – అరకిలో, ఉప్పు – తగినంత, కరివేపాకు – 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిర్చి – 3, చిక్కటి కొబ్బరి పాలు – 300 ఎమ్ ఎల్.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్,జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2.
సొరకాయ కొబ్బరి పాల కూర తయారీ విధానం..
కళాయిలో పెరుగును తీసుకోవాలి. తరువాత నీళ్లు పోసి ఉండలు లేకుండా మజ్జిగలాగా చేసుకోవాలి. తరువాత సొరకాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కలపాలి. తరువాత మూత పెట్టి ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. మజ్జిగ ఇంకి ముక్కలు ఉడికిన తరువాత కొబ్బరి పాలు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి పాలు ఇంకి పోయే వరకు ఉడికించాలి. పాలు కొద్దిగా మిగిలి ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత దీనిని కూరలో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ కొబ్బరి పాలకూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా సొరకాయ కూరను తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.