Spicy Mutton Fry : మటన్ ను మనలో చాలా మంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మటన్ తో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. మటన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మటన్ ఫ్రై కూడా ఒకటి. మటన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ మటన్ ను ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా తయారు చేసే రాయలసీమ స్టైల్ స్పైసీ మటన్ ప్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. కారం ఎక్కువగా తినే వారు ఈ మటన్ ఫ్రైను మరింత ఇష్టపడతారని చెప్పవచ్చు. ఈ మటన్ ఫ్రైను తయారు చేయడం ర కూడా చాలా సులభం. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా ఈ మటన్ ఫ్రైను చక్కగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, స్పైసీగా ఉండే రాయలసీమ స్టైల్ మటన్ ప్రైను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్సైసీ మటన్ ప్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టీ స్పూన్స్, నీళ్లు – 300 ఎమ్ ఎల్, కరివేపాకు – 2 రెమ్మలు, ఎండుమిర్చి – 4, తరిగిన పచ్చిమిర్చి – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
లేత మటన్ – అరకిలో, కారం – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, నూనె – 3 టేబుల్ స్పూన్స్.
స్సైసీ మటన్ ప్రై తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శుభ్రంగా కడిగిన మటన్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు వేసి బాగా కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచడం వీలు కానీ వారు కనీసం 2 గంటల పాటైన మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మటన్ వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి మూత పెట్టి 4 ఉండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో అర కప్పు నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇప్పుడు ఉడికించిన మటన్ ను నీటితో సహా వేసుకోవాలి. దీనిని కలుపుతూ నీరంతా పోయే వరకు వేయించాలి. మటన్ లోని నీరు పోయి నూనె పైకి తేలిన తరువాత గరం మసాలా వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించిన తరువాత కొత్తిమీర, మరో రెమ్మ కరివేపాకు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మటన్ ఫ్రై తయారవుతుంది. దీనిని పప్పు, రసం, పప్పు చారు, పచ్చి పులుసు వంటి వాటితో సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటాయి.