Talakaya Kura : మాంసాహారం తినే వారికి తలకాయ కూర రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. తలకాయ కూర తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. విటమిన్ బి12 తోపాటు కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి మినరల్స్ తలకాయ మాంసంలో అధికంగా ఉంటాయి. తలకాయ కూరను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు దృఢంగా తయారవడమే కాకుండా కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. ఇక రుచిగా తలకాయ కూరను ఎలా వండాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
తలకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
తలకాయ మాంసం – కిలో, తరిగిన ఉల్లిపాయలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్స్, పసుపు – ఒక టీ స్పూన్, పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి – 4 , కరివేపాకు – ఒక రెబ్బ, టమాట – 1 (పెద్దది), తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – 3 టేబుల్ స్పూన్స్, కారం – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – తగినన్ని.
మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
దాల్చిన చెక్క ముక్కలు – 3, లవంగాలు – 15, వెల్లుల్లి రెబ్బలు – 15, ధనియాలు – 3 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి ముక్కలు -3 టేబుల్ స్పూన్స్.
తలకాయ కూర తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో దాల్చిన చెక్క, ధనియాలు, ఎండు కొబ్బరి వేసి వేయించి పూర్తిగా చల్లారే వరకు ఉంచి జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి మరో సారి మిక్సీ పట్టుకోవాలి. తరువాత తలకాయ మాంసాన్ని 2 నుండి 3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా చేసుకోవాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం వేసి ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత మూత పెట్టి ఒక గంట పాటు కదలించకుండా ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో నూనె వేసి కాగాక తరిగిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి, కరివేపాకు, కొద్దిగా తరిగిన కొత్తిమీరను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తరువాత కలిపి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని వేసి కలిపి మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మూత తీసి తరిగిన టమాటా ముక్కలను వేసి కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి ఉడికించాలి. టమాటా ముక్కలు ఉడికిన తరువాత తగినన్ని నీళ్లు పోసి కలిపిమూత పెట్టి ఇంకో15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసి కలిపి మరలా మూత పెట్టి మాంసాన్ని పూర్తిగా ఉడికించాలి. చివరగా తరిగిన కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే తలకాయ కూర తయారవుతుంది. ఈ విధంగా తలకాయ కూరను సులభంగా వండవచ్చు. అయితే మట్టి పాత్రలో వండుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. తలకాయ కూరను అన్నం, చపాతీ, రోటి, రాగి సంగటి వంటి వాటితో కలిపి తింటే రుచి అదిరిపోతుంది. పైగా అనేక పోషకాలు కూడా లభిస్తాయి. వీటి వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.