Keyboard Typing : కంప్యూటర్ కీబోర్డుపై సహజంగానే ఎవరికైనా సరే వేగంగా టైప్ చేయాలని ఉంటుంది. కానీ కొందరు ఎంత ప్రయత్నించినా కంప్యూటర్ కీబోర్డుపై వేగంగా టైప్ చేయలేకపోతుంటారు. అయితే అలా వేగంగా టైప్ చేయడం అన్నది రాత్రికి రాత్రే రాదు. ఎన్నో సార్లు టైప్ చేస్తూ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే వేగంగా టైప్ చేయగలుగుతారు. ఇక కింద తెలిపిన కొన్ని చిట్కాలను పాటించడం వల్ల కూడా కంప్యూటర్ కీబోర్డుపై వేగంగా టైప్ చేయవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. కంప్యూటర్ కీబోర్డుపై వేగంగా టైప్ చేయాలంటే.. కూర్చునే భంగిమ కూడా సరిగ్గా ఉండాలి. వెన్నెముకకు కనీసం సగం వరకు అయినా సరే పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉండాలి. వెన్నెముక వెనుక చెయిర్‌కు ఆనుకుని ఉండాలి. అలాగే కింద కాళ్లను నేలపై పూర్తిగా ఆనించాలి. కీబోర్డు చివరి భాగంలో కింది వైపు చేతి మణికట్టులను ఉంచాలి. దీంతో గ్రిప్ సులభంగా లభిస్తుంది. టైపింగ్ వేగంగా చేయగలుగుతారు.
2. కంప్యూటర్ కీ బోర్డుపై A అనే అక్షరం నుంచి అదే వరుసలో L అనే అక్షరం వరకు ఉన్న వరుసను హోమ్ రో అంటారు. ఈ వరుసపై వేళ్లను ఉంచాలి. F అనే అక్షరంపై ఎడమ చేతి చూపుడు వేలును, J అనే అక్షరంపై కుడి చేతి చూపుడు వేలును ఉంచాలి. తరువాత టైపింగ్ ప్రారంభించాలి. ఇలా నెమ్మదిగా టైప్ చేస్తూ పోతే సులభంగా టైప్ చేయగలుగుతారు. దీంతో టైపింగ్ వేగం కూడా పెరుగుతుంది.
3. ఆన్‌లైన్ లో పలు సైట్లలో టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని ఓపెన్ చేసి టైపింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు. దీంతో టైపింగ్ వేగంగా వస్తుంది.
4. ఇక టైపింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టిన నాడే వేగంగా టైప్ చేయడం రావాలని అనుకోకూడదు. కనీసం 2 వారాల పాటు రోజూ చాలా సేపు కీబోర్డుపై టైప్ చేస్తుంటేనే ఒక మోస్తరుగా టైపింగ్ వస్తుంది. ఆరంభంలో చేతి వేళ్ల నొప్పులు ఉంటాయి. కానీ టైప్ చేస్తూ పోయేకొద్దీ వేళ్లు సులభంగా వంగుతాయి. దీంతో ఆపై ఎంత టైప్ చేసినా నొప్పులు ఉండవు. కనీసం ఒక నెల రోజుల పాటు రోజూ క్రమం తప్పకుండా టైపింగ్ ప్రాక్టీస్ చేస్తే.. కచ్చితంగా వేగంగా టైపింగ్ చేయగలుగుతారు.
5. కంప్యూటర్ కీబోర్డుపై అక్షరాలు ఒక క్రమ పద్ధతిలో ఉండవు. కనుక వాటిని గుర్తుంచుకోవాల్సిందే. టైపింగ్ చేయడం వేగంగా రావాలంటే ఆ అక్షరాలు ఎక్కడ ఉన్నాయో గుర్తు పెట్టుకోవాలి. సాధన చేస్తే కచ్చితంగా అలవాటు అవుతుంది. దీంతో కీబోర్డును చూడకుండానే టైప్ చేయగలుగుతారు.
ఈ చిట్కాలను పాటించడం వల్ల చాలా త్వరగా టైపింగ్ నేర్చుకోవచ్చు. అంతేకాదు.. వేగంగా టైప్ చేయగలుగుతారు కూడా..!