Virat Kohli : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి తాజాగా ఓ సరికొత్త అవతారంలో కనిపించాడు. తలకు టర్బన్ ధరించిన కోహ్లి ముంబైలో సందడి చేశాడు. చూస్తుంటే అతను ఓ యాడ్ కోసం షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కాగా కోహ్లి వెంట అతని భార్య అనుష్క శర్మ కూడా ఉండడం విశేషం. కోహ్లి తెల్లని షర్ట్ ధరించి తలకు బ్లూ కలర్ టర్బన్ కట్టుకోగా.. అనుష్క శర్మ సల్వార్ సూట్ ధరించింది. వీరు ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో సందడి చేశారు. ఈ క్రమంలోనే ఆ సమయంలో తీసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
అయితే కోహ్లి కొత్త అవతారాన్ని చూసిన నెటిజన్లు అతన్ని విమర్శిస్తున్నారు. శ్రీలంక జట్టు ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తుండగా.. భారత్‌తో ఆ టీమ్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. అయితే శ్రీలంకతో భారత్ ఆడే టీ20 మ్యాచ్‌లకు కోహ్లి అందుబాటులో ఉండడం లేదు. అతను బ్రేక్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లిని నెటిజన్లు విమర్శిస్తున్నారు. భారత జట్టుకు ఆడేందుకు సమయం లేదు.. కానీ యాడ్‌లలో పాల్గొనేందుకు మాత్రం సమయం ఉందా.. అంటూ ప్రశ్నిస్తున్నారు.
కాగా అనుష్క శర్మ ప్రస్తుతం తన చక్‌దే ఎక్స్‌ప్రెస్ సినిమా కోసం క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటోంది. భారత మహిళా జట్టు ప్లేయర్ ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అనుష్క శర్మ మెయిన్ రోల్‌లో నటించనుంది. అందుకనే సినిమా కోసం ఆమె ముంబైలో క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఇక తాజాగా వీరు ఒకే దగ్గర భిన్న దుస్తుల్లో కనిపించడంతో ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.