Dogs Cry At Night : మనం వివిధ రకాల జంతువులను, పక్షులను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. మనం ఎక్కువగా ఇంట్లో పెంచుకునే ప్రాణులల్లో కుక్కలు కూడా ఒకటి. చాలా మందికి కుక్కలను పెంచుకోవడమంటే ఎంతో ఇష్టం. ఇష్టాన్ని బట్టి, వీలుని బట్టి, స్థోమతను బట్టి వివిధ రకాల కుక్కలను ఇప్పటికే మనలో చాలా మంది పెంచుకుంటున్నారు. కొందరైతే వాటిని ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తూ ఉంటారు. వాటిని ఎంతో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో పెంచుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు రాత్రి పూట కుక్కలు ఎక్కువగా అరుస్తూ ఉంటాయి. మనకు నిద్రలేకుండా చేస్తాయి. అయితే ఇలా అరవడానికి కారణం ఏమిటో మాత్రం మనకు తెలియదు. వాటిని ఎంత సముదాయించిన కూడా కుక్కలు అరవడం మాత్రం ఆపవు. అయితే రాత్రి పూట కుక్కలు అరవడానికి అనేక కారణాలు ఉంటాయి.
ఈ కారణాలను తెలుసుకోవడం వల్ల కుక్కలు ఎందుకు అరుస్తున్నాయో మనం సులభంగా తెలుసుకోవచ్చు. రాత్రిపూట ఇంట్లో మనం పెంచుకునే కుక్కలు ఎక్కువగా అరవడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. పడుకున్నప్పుడు కుక్కలు ఎక్కచువగా అరుస్తూ ఉంటే వాటికి కీళ్ల నొప్పులు ఉన్నాయని అర్థం. అలాగే అవి పడుకునే చోట ఇబ్బందిగా ఉందని అర్థం చేసుకోవాలి. వాటిని ఉంచే స్థలాన్ని మార్చి చూడాలి. అలాగే నిద్రపోయేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్న కూడా కుక్కలు అరుస్తూ ఉంటాయి. అదే విధంగా ఏది పడితే అది తిన్నా కూడా జీర్ణసమస్యలు తలెత్తి కుక్కలు అరుస్తూ ఉంటాయి. కడుపు నొప్పి, కడుపుఉబ్బరం, అలర్జీ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా కుక్కలు అరుస్తాయి. ఇక కుక్కలకు తగిన వ్యాయామం చేయించకపోవడం వల్ల అవి విసుగు చెంది కూడా అవి అరుస్తాయి. కనుక కుక్కలకు తగినంత వాకింగ్ చేయించడం వాటిని ఆడించడం చాలా అవసరం.
అదే విధంగా కుక్కలను ప్రేమగా చూపుకునే వారు వాటిని వదిలి వెళ్లిన లేదా మీతో పాటు వాటిని పడుకోనీయ్యక పోవడం వల్ల దూరమవుతున్నారేమో అన్న భావనతో కూడా కుక్కలు అరుస్తూ ఉంటాయి. పెద్దగా ఉండే కుక్కల కంటే కుక్క పిల్లలు ఎక్కువగా అరుస్తూ ఉంటాయి. కుక్క పిల్లలు వాటి తల్లి వాటి దగ్గర లేకపోవడం వల్ల అలాగే మీ దృష్టి కోరుకోవడానికి అవి అరుస్తాయి. అదే విధంగా కుక్క పిల్లలకు సరైన శిక్షణ ఇవ్వకపోవడం వల్ల అవి పెద్దయ్యాక ఎప్పుడు పడితే ఇష్టం వచ్చినట్టు అరుస్తూ ఉంటాయి. ఇక కొన్ని సందర్భాల్లో కుక్కలకు ఆకలి వేయడం వల్ల కూడా అరుస్తాయి.. అదే విధంగా రాత్రి పూట టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తే కూడా కుక్కలు అరుస్తాయి. కనుక కుక్కలను పడుకోబెట్టే ముందు వాటి కాలకృత్యాలకు తీసుకెళ్లడం అలవాటు చేయాలి.