Ragi Upma : రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. చిరుధారన్యాలైన రాగులను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. రాగులను పిండిగా చేసి రొట్టె, సంగటి వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. అలాగే రాగులను రవ్వగా చేసి మనం ఉప్మాను కూడా తయారు చేసుకోవచ్చు. రాగి రవ్వతో చేసే ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి. షుగర్ అదుపులోఉంటుంది. కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో మనం బరువు కూడా సులభంగా తగ్గవచ్చు. ఈ ఉప్మాను తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. రాగిఉప్మాను తయారు చేయడం కూడా చాలా సులభం. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ రాగి ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగి రవ్వ – ఒక గ్లాస్, నూనె – 2 టీ స్పూన్స్, పల్లీలు – గుప్పెడు, జీడిపప్పు – కొద్దిగా, ఆవాలు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, వేడి నీళ్లు – 3 గ్లాసులు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
రాగి ఉప్మా తయారీ విధానం..
ముందుగా రాగి రవ్వను శుభ్రంగా కడిగి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పల్లీలు, జీడిపప్పు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే నూనెలో ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం తరుగు, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత రవ్వ వేసి వేయించాలి. దీనిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత వేడి నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మంటను చిన్నగా చేసి ఉడికించాలి. రవ్వ మెత్తగా ఉడికి దగ్గర పడిన తరువాత వేయించిన పల్లీలు, జీడిపప్పు, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి ఉప్మా తయారవుతుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఉప్మాను తినని వారు కూడా ఈ ఉప్మాను ఇష్టంగా తింటారు.