Kandi Kattu : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో కందిపప్పు కూడా ఒకటి. కందిపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో అనేక రకాల పప్పు కూరలు, సాంబార్, పప్పు చారు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా కందిపప్పుతో మనం ఎంతో రుచిగా ఉండే కందికట్టును కూడా తయారు చేసుకోవచ్చు. కందికట్టు చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా పాతకాలంలో తయారు చేసుకునే వారు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు కందిపప్పుతో కందికట్టును తయారు చేసుకుని తినవచ్చు. దీనిని తినడం వల్ల గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ఎంతో రుచిగా, పుల్ల పుల్లగా ఉండే ఈ కందికట్టును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కందికట్టు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – ఒక గ్లాస్, నీళ్లు – 4 నుండి 5 గ్లాసులు, పసుపు – పావు టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – అర టీ స్పూన్, మెంతులు – 10, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, ఎండుమిర్చి – 4, తరిగిన పచ్చిమిర్చి -1, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, నిమ్మరసం – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
కందికట్టు తయారీ విధానం..
ముందుగా కందిపప్పును దోరగా వేయించి గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత ఈ పప్పును కుక్కర్ లో వేసి పసుపు, నీళ్లు పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కుక్కర్ మూత తీసి పప్పును కాకుండా నీటిని మాత్రమే మరో గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత తాళళింపుకు కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ముందుగా పప్పు ఉడికించిన నీటిని పోసి కలపాలి. తరువాత ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కందికట్టు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.