అవి నేను ఇంటర్ చదువుతున్న రోజులు. అందులో బైపీసీ తీసుకున్నా. ఎలాగైనా నీట్ రాసి చక్కని ర్యాంక్ తెచ్చుకుని ఎంబీబీఎస్ చేయాలని నాకు కోరికగా ఉండేది. అందుకోసమే కష్టపడి చదివేదాన్ని. అలా కాలేజీ రోజుల్లో నాకు చరణ్ అని మా క్లాస్ మేట్ ఒకతను పరిచయం అయ్యాడు. అతను చాలా మంచి వ్యక్తి. చదువుల్లో అతను, నేను పోటీ పడే వాళ్లం. ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. బైపీసీ సబ్జెక్టుల్లో మాకు ఏవైనా డౌట్స్ వస్తే ఇద్దరం విడిగా కూర్చుని ఒకరి డౌట్స్‌ను ఒకరం క్లారిఫై చేసుకునేవాళ్లం. ఇది చూసి నా స్నేహితులు, రామ్ ఫ్రెండ్స్ మమ్మల్ని ఆట పట్టించేవారు. అయినా మేం పట్టించుకునే వాళ్లం కాదు. మేం కేవలం సబ్జెక్టుల్లో మాకు ఉన్న డౌట్స్ ను మాత్రమే క్లియర్ చేసుకునే వాళ్లమని చెప్పేవాళ్లం. అయినా మా ఫ్రెండ్స్ మా మధ్య ఏదో ఉందని అనుకునేవారు. అయితే చరణ్ ఫ్రెండ్స్ కొందరు నాకు ఒక రోజు చెప్పారు. అతను నన్ను చాలా ప్రేమిస్తున్నాడని వారు నాతో అన్నారు.
అయినా చరణ్ నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు. నేనూ అలాగే కామ్‌గా ఉన్నా. కొంత కాలం అలా చూపులతోనే ఇద్దరి మధ్య ప్రేమ నడిచినట్టు అనిపించింది. అతన్ని నేను, నేను అతన్ని లవ్ చేస్తున్నాం అని ఇద్దరికీ తెలుసు. అయినా ఇద్దరం ఒకరికొకరం ఐ లవ్ యూ చెప్పుకోలేదు. కాలేజీ రోజుల్లో చరణ్ నన్ను కనీసం టచ్ కూడా చేయలేదు. చివరకు కాలేజీ సెకండియర్ కూడా అయిపోయింది. ఇంటర్‌లో మంచి మార్కులతో పాసయ్యా. కానీ నీట్‌లో మంచి ర్యాంక్ రాలేదు. ఇంటర్ పై దృష్టి పెట్టడంతో నీట్‌లో ర్యాంక్ రాలేదు. నాకు నీట్‌లో వచ్చిన ర్యాంక్‌కు బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో సీట్లు వచ్చాయి. అయినా నాకు ఎంబీబీఎస్ చేయాలని ఉండడంతో నీట్‌కు లాంగ్ టర్మ్ కోసం ఓ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయ్యా.
అలా నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నా అన్నమాటే గానీ చరణ్‌పైనే నా ధ్యాస ఉండేది. ఎందుకంటే నీట్‌లో అతనికి మంచి ర్యాంక్ వచ్చింది. అతను ఎంబీబీఎస్‌లో జాయిన్ ఉంటాడని అనుకున్నా. అతని ఫోన్ నంబర్ మార్చినట్టున్నాడు. నాకు ఆ వివరాలు చెప్పలేదు. దీంతో చరణ్ పై ధ్యాస పోయింది. చదువు నీట్‌పైకి మళ్లింది. అలా కొన్ని రోజులు అయ్యాక నీట్ కోచింగ్ సెంటర్‌లో రామ్ అనే మరో యువకుడితో నాకు పరిచయం అయింది. అతను చాలా ఇంటెల్లిజెంట్. నీట్‌లో మంచి ర్యాంక్ వచ్చినా, మంచి కాలేజ్‌లో సీటు రాలేదని చెప్పి అతను కూడా నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్‌లో జాయిన్ అయ్యాడు. క్రమంగా అతనికి, నాకు మధ్య స్నేహం ఏర్పడింది. అది ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది.
రామ్ ఎప్పుడూ జోకులు వేసేవాడు. ఎవరికీ తెలియని కొత్త విషయాలు చెప్పేవాడు. అందరితోనూ జోవియల్‌గా ఉండేవాడు. అతనిలో ఉన్న అవే గుణాలు నన్ను ఆకర్షించాయి. దీంతో అతని ప్రేమలో పడిపోయా. ఇద్దరం ఒకరికొకరం ఐ లవ్ యూ చెప్పుకున్నాం. కొన్ని రోజులు సరదాగా గడిపాం. చివరకు అది హద్దులు దాటింది. ఇద్దరం శారీరకంగా కూడా ఒక్కటయ్యాం. ఇంతలో చరణ్‌కు ఈ విషయాలు తెలిశాయి. నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయిన కొందరు చరణ్ ఫ్రెండ్స్ నా విషయాలను అతనికి చెప్పారు. చివరకు చరణ్ గురించిన ఓ షాకింగ్ విషయం నాకు తెలిసింది.
చరణ్‌కు నీట్‌లో మంచి ర్యాంక్ ర్యాంక్ వచ్చి అతను ఎంబీబీఎస్ చేస్తున్నాడనే మాటే గానీ ధ్యాస మొత్తం నాపైనే ఉండేదట. నాకు నీట్‌లో ర్యాంక్ రాకపోవడంతో ఈ సారైనా ర్యాంక్ తెచ్చుకుంటుందని అతను భావించి నా నుంచి దూరంగా ఉన్నాడట. అలాగైనా నా దృష్టి చదువుపై ఉంటుందని, ర్యాంక్ వస్తుందని అతను భావించాడట. ఈ విషయం నాకు తెలియదు. తెలిశాక మౌనంగా ఏడ్చా. అయితే చరణ్ నన్ను ప్రేమిస్తున్నాడన్న విషయం రామ్‌కు తెలిసింది. అతను నాతో గొడవ పెట్టుకుని నన్ను వదిలించుకున్నాడు. నేను మోసపోయానని గ్రహించా. రామ్ నన్ను విడిచిపెట్టాకే అతని అసలు స్వభావం తెలిసింది.
అతను నాతో శారీరక సంబంధం పెట్టుకునేందుకు అలా నా ముందు ప్రేమ నటించాడని తెలుసుకున్నా. దీంతో నాకు నా జీవితం ఒక్కసారిగా నరకం అనిపించింది. అయినా.. ధైర్యం తెచ్చుకున్నా.. రామ్‌కు దూరంగా ఉన్నా. అతనితో విడిపోయాక తిరిగి అతనిలో మాట్లాడలేదు. చదువుపైనే ధ్యాస పెట్టా. ఇప్పుడు నా ముందున్న గోల్ ఒక్కటే. నీట్‌లో ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్ చేయాలి.. అంతే.. నాకు, రామ్‌కు ఉన్న సంబంధం గురించి చరణ్‌కు తెలిసింది కాబట్టి ఇక చరణ్ నా దగ్గరకు రాడనే అనుకుంటున్నా. కానీ నాకు నీట్ ర్యాంక్ వచ్చాక ఆ విషయం చెప్పడం కోసమైనా అతన్ని ఒకసారి కలుస్తా..! అతను మళ్లీ నన్ను ఆదరిస్తాడనే నమ్మకం లేదు. అయినా సరే.. అతనికి ఓ మంచి స్నేహితురాలిగా ఉండిపోతా..!