సెల్‌ఫోన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ మనిషి శరీరానికి హాని కలిగిస్తుంది. ఈ మాట ఇప్పటిది కాదు. సెల్‌ఫోన్లు మొదటి సారిగా వినియోగంలోకి వచ్చినప్పటి నుంచి మనకు దీన్ని గురించి సైంటిస్టులు చెబుతూనే ఉన్నారు. ఇంతకీ అసలు ఆ రేడియేషన్ మన శరీరానికి ఏ విధంగా హాని కలిగిస్తుంది..? దాంతో మనకు ఎలాంటి అనారోగ్యాలు కలుగుతాయి..? అసలు ఓ సెల్‌ఫోన్‌కు రేడియేషన్ స్థాయి ఉంత ఉంటుంది..? దాన్నుంచి మనం జాగ్రత్తగా ఉండడం ఎలా..? వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
స్పెసిఫిక్ అబ్జార్‌ప్షన్ రేట్ (Specific Absorption Rate) గురించి మీరు వినే ఉంటారు. సైన్స్ సబ్జెక్టు చదువుకున్న వారికైతే దీని గురించి అవగాహన ఉంటుంది. దీన్నే SAR Value అని కూడా పిలుస్తారు. దీన్ని తెలుగులో విశిష్ట శోషణ గుణకం అని కూడా అంటారు. అంటే నిర్దిష్ట పరిమాణంలో బరువు ఉన్న వ్యక్తికి చెందిన 1 కిలో ద్రవ్యరాశి ఉన్న శరీరం లోపలికి గ్రహించే శక్తి విలువ అది. రేడియో తరంగాలతో కలిసి ఉన్న విద్యుదయస్కాంత క్షేత్ర ప్రభావం (ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్)కు మనిషి శరీరం గురైనప్పుడు ఆ శరీరం సదరు తరంగాల నుంచి విడుదలయ్యే శక్తిని తనలోకి శోషించుకునే రేటునే స్పెసిఫిక్ అబ్జార్‌ప్షన్ రేట్ అని అంటారు. ఇది మనిషి ఉన్న బరువును బట్టి మారుతుంది. కానీ ఏదైనా ఒక సెల్‌ఫోన్‌కు మాత్రం ఒకటే SAR Value ఉంటుంది. దాన్ని బట్టి మన శరీరం ఆ ఫోన్ నుంచి రేడియో తరంగాల శక్తిని లోపలికి గ్రహిస్తుంది.
మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ను వాడుతుంటే దాంట్లో డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి అందులో *#07# డయల్ చేయండి. దీంతో మీ ఫోన్‌లో SAR Value ఎంత ఉందో ఇట్టే తెలిసిపోతుంది. అలా కాకున్నా ఫోన్‌కు సంబంధించిన బాక్స్ పై చూసినా SAR Value ను సులభంగా తెలుసుకోవచ్చు. అయితే మన దేశంలో లభించే సెల్‌ఫోన్ల SAR Value కేజీకి 1.6 వాట్లు అంటే 1.6w/kg లేదా అంతకన్నా తక్కువ ఉండాలి. అలా ఉంటేనే దాంతో మనకు కలిగే ముప్పు తప్పుతుంది. లేదంటే మనం సెల్‌ఫోన్ నుంచి విడుదలయ్యే అధిక రేడియేషన్ ప్రభావానికి లోనవ్వాల్సి ఉంటుంది. దీంతో అనేక రకాల అనారోగ్యాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది.
సెల్‌ఫోన్ రేడియేషన్ పట్ల జాగ్రత్తగా ఉండండిలా… సెల్‌ఫోన్‌లో 2 నిమిషాల పాటు మాట్లాడితే అనంతరం మెదడు పనితీరులో ఒక గంట వరకు చాలా మార్పు ఉంటుందట. దీన్ని సైంటిస్టులు ప్రయోగాత్మకంగ కనుగొన్నారు. కనుక సెల్‌ఫోన్‌లో ఏ కాల్ మాట్లాడినా వీలైంత వరకు 2 నిమిషాలలోపే ముగించడం ఉత్తమం. పెద్దలకే సెల్‌ఫోన్ రేడియేషన్ వల్ల చాలా అనారోగ్యకర పరిణామాలు సంభవిస్తాయి. ఇక పిల్లలకైతే ఇంకా ఎక్కువ దుష్పరిణామాలే కలుగుతాయి. కనుక పిల్లలకు అస్సలు సెల్‌ఫోన్లను ఇవ్వకూడదు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు తప్ప వీలైనంత వరకు సెల్‌ఫోన్‌ను శరీరానికి దూరంగా ఉంచడం మంచిది. అదే డెస్క్ జాబ్‌లు చేసే వారైతే తమ జేబుల్లో కాక ఫోన్లను డెస్క్‌పై పెట్టి పనిచేసుకోవడం ఉత్తమం. మన శరీర కింది భాగం పై భాగం కన్నా ఎక్కువ రేడియేషన్‌ను గ్రహిస్తుందట. సైంటిస్టులు దీన్ని కూడా నిరూపించారు. కనుక ఫోన్లను వీలైనంత వరకు కింది భాగంలో పెట్టకపోవడమే మంచిది.
కాల్స్ ఎక్కువగా మాట్లాడాల్సి వస్తే వైర్‌లెస్ కాకుండా వైర్ ఉన్న హెడ్‌సెట్లను వినియోగించాలి. అదే వైర్‌లెస్ సెట్ అయితే దాంతోనూ ఎంతో కొంత రేడియేషన్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. లిఫ్ట్‌లు లేదా అలాంటి పూర్తిగా మూసివేసిన ప్రదేశాల్లో సెల్‌ఫోన్లను అస్సలు వాడకూడదు. ఎందుకంటే ఆయా ప్రదేశాల్లో రేడియేషన్ ప్రభావం రెట్టింపుగా ఉంటుంది. సెల్‌ఫోన్ రేడియేషన్ పట్ల సరైన జాగ్రత్తలు పాటించకపోతే క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు వంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మెదడు పనితీరులోనూ గణనీయమైన మార్పు వస్తుంది.