Health Tips : ఎన్నో ఔషధ గుణాలు కలిగిన తీగ జాతికి చెందిన మొక్కలలో దూసర తీగ కూడా ఒకటి. బీడు భూములల్లో, పొలాల కంచెల వెంట, ఇతర చెట్లకు అల్లుకుని ఈ తీగ మొక్క ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దూసర తీగను చాలా మంది చూసే ఉంటారు. పూర్వకాలం నుండి ఆయుర్వేదంలో ఈ మొక్కను ఉపయోగించి అనేక రకాల రోగాలను నయం చేస్తున్నారు. దీనిని చీపురు తీగ, సిబి తీగ, పాతాళగరుడి అని పిలుస్తూ ఉంటారు. దూసర తీగలో ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. ఈ మొక్కలో ఉండే ఔషధ గుణాల గురించి.. ఈ మొక్కను ఉపయోగించి ఏయే వ్యాధులను నయం చేసుకోవచ్చు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒంట్లో అధికంగా ఉండే వేడిని క్షణాల్లో తగ్గించడంలో దూసర తీగ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒంట్లో వేడి అధికంగా ఉన్నప్పుడు దూసర తీగ ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు పోసి ఆ ఆకులను చేత్తో మెత్తగా చేసి వడకట్టాలి. కొద్ది సేపటికి ఆ నీరు జెల్ లా మారుతుంది. దీనిని 4 నుండి 5 టీ స్పూన్ల మోతాదులో తినడం వల్ల ఒంట్లో వేడి తగ్గి మలమూత్రం వెంబడి రక్తం పడడం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా ఈ జెల్ ను తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దూసర తీగ యాంటీ వైరల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. కనుక ఈ జెల్ ను తినడం వల్ల వైరస్ ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. ఈ విధంగా దూసర తీగ ఆకులతో చేసిన ఈ జెల్ ను తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ జెల్ ను 5 నుండి 6 టీ స్పూన్ల మోతాదులో రెండు వారాల పాటు తినడం వల్ల నరాల బలహీనత తగ్గుతుంది. శరీరకంగా బలంగా తయారవుతారు. చాలా మంది దీర్ఘకాలికంగా శరీరంలో అధిక వేడితో బాధపడుతూ ఉంటారు. అధిక వేడి వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఈ జెల్ ను 15 రోజుల పాటు తినడం వల్ల శరీరంలో వేడి తగ్గి రోగాల బారిన పడకుండా ఉంటారు. ప్రస్తుత కాలంలో చాలా మంది స్త్రీలు సంతాన లేమితో బాధపడుతున్నారు. అలాంటి వారు ఈ దూసర తీగ ఆకులతో చేసిన జెల్ ను తినడం వల్ల గర్భాశయ సంబంధిత సమస్యలు తగ్గి సంతానం కలుగుతుంది. ఈ జెల్ ను స్త్రీలు నెలసరి వచ్చిన మొదటి ఐదు రోజులు 5 టీ స్పూన్ల మోతాదులో తింటూ చప్పిడి పత్యం చేయడం వల్ల దోషాలు తొలగి సంతానం కలుగుతుంది. హార్మోన్ల అసమతుల్యతో బాధపడే వారు దీనిని తినడం చాలా మంచిది. గర్భాశయంలో ఎటువంటి దోషాలు లేకపోయినా కొన్ని సార్లు స్త్రీలకు సంతానం కలగదు. అలాంటి వారు ఈ దూసర తీగ ఆకులను సేకరించి రాత్రి పడుకునే ముందు పొత్తి కడుపు మీద ఉంచుకుని కట్టు కట్టి ఉదయాన్నే తీసేయాలి. ఇలా చేస్తూ దీని ఆకులతో చేసిన జెల్ ను తినాలి. ఇలా చేయడం వల్ల ఎటువంటి దోషాలు లేని స్త్రీలకు కూడా సంతానం కలుగుతుంది.
అంతేకాకుండా దూసర తీగ ఆకులతో చేసిన ఈ జెల్ ను తినడం వల్ల మూత్రంలో మంట తగ్గుతుంది. అధిక రక్త పోటు కూడా నియంత్రణలో ఉంటుంది. తలనొప్పి తగ్గుతుంది. జీర్ణాశయ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా మూత్రపిండాలలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారు ఈ జెల్ ను తినడం వల్ల మూత్రపిండాలలో ఉండే రాళ్లు అన్నీ కరిగి మూత్రం ద్వారా బయటకు పోతాయి. మానసిక రుగ్మతలను కూడా దూసర తీగ తగ్గిస్తుంది. 10 గ్రా. ల దూసర తీగ ఆకుల రసాన్ని 10 గ్రా. ల ఆవు నెయ్యితో కలిపి రెండు పూటలా భోజనానికి గంట ముందు తాగిస్తూ ఉండడం వల్ల మానసిక రుగ్మతలు తగ్గుతాయి. ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న షుగర్ వ్యాధిని తగ్గించడంలోనూ ఈ మొక్క ఎంతగానో సహాయపడుతుంది.
ఒక గ్లాసు నీటిలో 10 గ్రా. ల దూసర తీగ ఆకులను వేసి ఒక కప్పు కషాయం అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. దీనికి ఒక కప్పు గోరు వెచ్చని ఆవు పాలను కలిపి రెండు పూటలా తాగుతూ ఉండడం వల్ల షుగర్ వ్యాధి తగ్గుతుంది. పూర్వకాలంలో ఈ మొక్క వేరును ఇంటి గుమ్మానికి కట్టుకోవడం వల్ల పాములు ఇంటి దరిదాపుల్లోకి రావని నమ్మేవారు. ఈ మొక్క ఆకులను సేకరించి నీడలో ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. పూటకు 5 గ్రా. ల చొప్పున రెండు పూటలా ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కలిపి తాగుతూ ఉండడం వల్ల అతి మూత్ర వ్యాధి తగ్గుతుంది. నీరసంగా ఉన్నప్పుడు ఈ తీగ ఆకులను నమిలి మింగడం వల్ల వెంటనే నీరసం తగ్గుతుంది. ఈ మొక్క ఆకుల రసాన్ని పై పూతగా రాయడం వల్ల గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఈ విధంగా దూసర తీగను ఉపయోగించడం వల్ల అనేక రోగాల నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.