Lord Shani Dev : మనం భగవంతుడి కృపకోసం అనేక పూజలు చేస్తూ ఉంటాం. మనం చేసే పూజల వెనుక ఏదో ఒక అంతరార్థం ఉండనే ఉంటుంది. మనకు ఉండే ఏడు వారాలలో ఒక్కో వారానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే శనివారానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. శనివారం నాడు ఏ పనులు చేయాలి.. ఏ పనులు చేయకూడదు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం నాడు న్యాయదేవుడైన శనిరోజుగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రోజున ఇనుము సంబంధిత వస్తువులను, ఉప్పును కొనుగోలు చేయకూడదు. అంతేకాకుండా శనివారం రోజున ఉత్తర, దక్షిణ దిక్కులలో ప్రయాణం చేయకూడదట. అసలు మనం ఎవరిని అవమానించకూడదు. ఈ రోజున ముఖ్యంగా పారిశుధ్య కార్మికులను అస్సలు అవమానించకూడదు.
శని మానవులకు శుభ, అశుభ ఫలితాలను ఇస్తాడని నమ్ముతారు. శని దేవుడికి కోపం బాగా ఎక్కువట. ఆ శని భగవానున్ని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం రోజున కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. అసలు శని భగవానుని పేరు వినగానే మన మనసులో ఎన్నో అనుమానాలు కలుగుతాయి. శని దేవుడు మనకు మంచి పనులు చేస్తే మంచి ఫలితాలను, చెడు పనులు చేస్తే చెడు ఫలితాలను ఇస్తాడని నమ్ముతారు. శనిదేవున్ని పూజించడానికి శనివారం ఉత్తమమైనదిగా పండితులు చెబుతున్నారు. శనిదోషం పడితే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. కోరిన కోరికలు కూడా తీరవు. అంతేకాకుండా వ్యాపారంలో నష్టాలు, ఆర్థిక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కోర్టు కేసులు తెగవు. ఇలా ఎన్నో రకాల దోషాలు వస్తాయి. శనిదోషాలను నివారించుకోవడానికి ఉత్తమమైన రోజు శని త్రయోదశి. అలాగే శనివారం నాడు హనుమంతుడికి సింధూరం, మల్లెపువ్వులను సమర్పించాలి. హనుమాన్ చాలీసా కూడా చదవాల్సి ఉంటుంది. హనుమంతున్ని పూజించిన వారికి శని దేవుని ఇబ్బందులు ఎదుర్కోవలసిన అవసరం ఉండదని పండితులు చెబుతున్నారు.
శనివారం రోజున రావి చెట్టు కు నీరు పోసి ఆ చెట్టుకు నమస్కరించి ఏడు సార్లు చెట్టు చుట్టూ తిరగాలి. శనివారం రోజున పేదలకు అన్నం పెట్టడం వల్ల కూడా శని దేవుడు సంతోషిస్తాడని చెబుతూ ఉంటారు. ప్రతి శనివారం నూనె, నల్ల నువ్వులు శనిదేవుడికి సమర్పించాలి. వీటిని దానంగా ఇచ్చినా కూడా మంచి ఫలితం ఉంటుంది. నూనెను దానంగా ఇచ్చే ముందు శుభ్రంగా స్నానం చేసి ఒక గిన్నెలో నూనెను తీసుకుని దానిలో ముఖాన్ని చూసుకుని ఆ నూనెను దానంగా ఇవ్వాలి. శని దేవున్ని పూజించాలి. ఆయనకు నీలం రంగు పువ్వులను సమర్పించాలి. అలాగే శని దేవున్ని పూజించేటప్పుడు ఆయన విగ్రహం ఎదురుగా నిలబడి పూజ చేయకూడదు. శనిదేవున్ని ప్రసన్నం చేసుకోవడానికి సూర్యాస్తమయం తరువాత రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఒకవేళ రావి చెట్టు అందుబాటులో లేకుంటే ఏదైనా చెట్టు దగ్గర కూడా దీపాన్ని వెలిగించవచ్చు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
శనివారం రోజున రుద్రాభిషేకం చేయించుకోవాలి. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవాలి. అలా వీలు కాని వారు శనివారం రోజు మాత్రం తప్పకుండా ఉదయాన్నే నిద్రలేవాలి. శనివారం సూర్యోదయం తరువాత నిద్ర లేస్తే ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. ఈ చిన్న చిన్న నియమాలను పాటించకపోవడం వల్లే మనం శని దేవుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోంది. ఈ కారణంగానే మనం దరిద్రాన్ని చవి చూడాల్సి వస్తోంది. శని దేవుడే మనకు శుభ, అశుభ ఫలితాలను ఇస్తాడు కనుక శుభ ఫలితాలు కావాలనుకునే వారు ఈ నియమాలను పాటించాలి. వీటిని పాటించడం వల్ల శని దేవుడి కృపను పొందవచ్చు.