Reddyvari Nanubalu : రెడ్డి వారి నానుబాలు మొక్క.. ఈ మొక్కను మనలో చాలా మంది చూసే ఉంటారు. మన ఇంటి చుట్టు పక్కల, పొలాల దగ్గర ఎక్కడపడితే అక్కడ ఈ మొక్క కనిపిస్తుంది. ఈ మొక్కను చాలా మంది పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్కను అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఈ రెడ్డి వారి నానుబాలు మొక్కను సంస్కృతంలో దుక్దిక అని హిందీలో దూక్ దీ అని పిలుస్తారు. అలాగే దీనికి నాగార్జుని, పచ్చ బొట్లాకు, పాలకాడ, గొర్రెకాడ అని పేర్లు కూడా కలవు. ఈ మొక్క ఎరుపు, తెలుపు రంగుల్లో రెండు రకాలుగా లభ్యమవుతాయి. ఒక అడుగు పెరిగే పెద్ద రెడ్డి వారి నానుబాలు కంటే చిన్న ఆకులతో ఉండే చిన్న రెడ్డి వారి నానుబాలు మొక్కలోనే ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి.
పూర్వకాలంలో ఈ మొక్క ఆకులను దంచి దాని నుండి తీసిన రసంతో పచ్చబొట్లను పొడిచే వారు. దీంతో ఈ మొక్కకు పచ్చ బొట్లాకు అనే పేరు వచ్చింది. ఈ మొక్క తీపి, కారం, చేదు రుచులను కలిగి ఉంటుంది. రెడ్డి వారి నానుబాలు మొక్కలో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే దీని వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొక్క ఆకుల రసాన్ని లేదా ఆకుల కషాయాన్ని పరిమిత మోతాదులో తీసుకుంటే మేహ రోగాలు, ప్రేగుల్లో పుట్టే క్రిమి రోగాలు, విష రోగాలు, నేత్ర రోగాలు, కంఠ రోగాలు, చర్మ రోగాలు, సెగ రోగాలు సమూలంగా నివారించబడతాయి. రెడ్డి వారి నానుబాలు మొక్క ఆకులను పప్పులో వేసుకుని తింటే బాలింతల్లో పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.
మధుమేహం కారణంగా నేత్ర రోగాలు, మూత్ర రోగాలు, నరాల బలహీనత వంటి ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. అలాంటి సమస్యలతో బాధపడే వారికి ఈ మొక్క దివ్యౌషధంగా పని చేస్తుంది. ఈ మొక్కను సమూలంగా సేకరించి ముక్కలు ముక్కలు చేసి ఎండబెట్టాలి. తరువాత వీటిని మెత్తగా దంచి జల్లించగా వచ్చిన పొడిని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజూ రెండు పూటలా అర టీ స్పూన్ మోతాదులో అర కప్పు గోరు వెచ్చని నీటిలో కలిపి ఆహారానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. నరాలకు బలం కలుగుతుంది. ఈ పొడిని తీసుకోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే చాలా మంది శరీరంలో కణతులు, సెగ గడ్డలు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి కూడాఈ రెడ్డి వారి నానుబాలు మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ మొక్కను తుంచగా వచ్చిన పాలను కణతులపై, గడ్డలపై రాస్తూ ఉండడం వల్ల అవి క్రమంగా తగ్గు ముఖం పడతాయి. ఈ మొక్క నుండి వచ్చిన పాలను ఒక చుక్క మోతాదులో కంటిలో ఉంచుకుని కళ్లు మూసుకుని పావు గంట పాటు అలాగే ఉండాలి. ఇలా 20 రోజుల పాటు క్రమం తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల కంటి సమస్యలు, కంటి పొరలు క్రమంగా తగ్గు ముఖం పడతాయి. అయితే వేడి శరీరతత్వం ఉన్న వారు రెండు రోజులకొకసారి ఇలా చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ మొక్క ఆకుల రసాన్ని 3 టీస్పూన్ల మోతాదులో తీసుకుని అందులో అర టీ స్పూన్ మిరియాల పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని గర్భాశయ దోషాలతో బాధపడే స్త్రీలు బహిష్టు వచ్చిన మొదటి మూడు రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవాలి.
అలాగే దీనిని తీసుకున్న గంట వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఇలా గర్భం ధరించే వరకు ప్రతి నెలా పాటించాలి. ఇలా చేయడం వల్ల బహిష్టు క్రమబద్దమై గర్భాశయం శుద్ది చెంది అండం చక్కగా విడుదలై సంతాన భాగ్యాన్ని పొందవచ్చు. ఈ చిట్కాను పాటించే సమయంలో పచ్చటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇంట్లో చేసిన నేతి వంటలు, ఆవు పాలు, ఆవు పెరుగును ఎక్కువగా తీసుకోవాలి. సంతానలేమి సమస్యతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా రెడ్డి వారి నానుబాలు మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.