Fish Fry : మనం ఆహారంగా తీసుకునే మాంసాహార ఉత్పత్తుల్లో చేపలు ఒకటి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికి తెలుసు. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, బరువు తగ్గడంలో, కంటి చూపును మెరుగుపరచడంలో, మెదడు చక్కగా పని చేసేలా చేయడంలో చేపలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా రుచిగా, సులవుగా, తక్కువ నూనెను ఉపయోగించి చేపల ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిష్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చేపలు – ఒక కిలో, ఉప్పు – తగినంత, నిమ్మరసం – రెండు టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – రెండు టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – రెండు టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, నూనె – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఫిష్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా చేప ముక్కలను ఉప్పు, నిమ్మరసం వేసి శుభ్రంగా కడగాలి. తరువాత వాటిని నీళ్లు లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో కొత్తిమీర, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత రెండు టేబుల్ స్పూన్ల నూనె, తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మసాలా మిశ్రమాన్ని చేప ముక్కలకు అన్ని వైపులా బాగా పట్టించాలి. తరువాత కళాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చేప ముక్కలను వేసి వేయించాలి. ఈ చేప ముక్కలను మధ్యస్థ మంటపై రెండు వైపులా కరకరలాడుతూ ఎర్రగా అయ్యే వరకు బాగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. చేప ముక్కలను వేయించుకున్న ప్రతిసారి ఇలా కొద్దిగా నూనెను వేసుకుంటూ ఉండాలి.
ఇలా చేప ముక్కలను వేయించుకున్న తరువాత వాటిపై కొత్తిమీరను చల్లి గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చేపల ఫ్రై తయారవుతుంది. దీనిని నేరుగా తినవచ్చు లేదా సాంబార్, రసం, పప్పు వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా తినవచ్చు. ఈ విధంగా చేపల ఫ్రైను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది.