Thangedu : ప్రకృతిలో ప్రతి మొక్క ఏదో ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉంటుందని మనకు తెలుసు. మనకు వచ్చే ప్రతి అనారోగ్య సమస్యకు పరిష్కారం మనకు ప్రకృతిలోనే లభిస్తుంది. మనం పెంచకుండానే చాలా మొక్కలను ప్రకృతి మనకు పెంచి మరీ అందిస్తుంది. పూర్వకాలం నుండి ఆయుర్వేద శాస్త్రాన్ని బ్రతికిస్తుంది కూడా ఈ మొక్కలే. ఈ మొక్కల నుండే ఔషధాలను తయారు చేసుకుని మనం ఉపయోగిస్తున్నాం. మనకు ఔషధంగా ఎంతగానో ఉపయోగపడే మొక్కల్లో తంగేడు మొక్క కూడా ఒకటి. ఈ మొక్క మనందరికీ తెలుసు. తంగేడు మొక్కలో ఉండే ఔషధ గుణాలు ఏమిటి.. ఏయే వ్యాధులను నయం చేయడంలో ఈ మొక్క మనకు ఉపయోగపడుతుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తంగేడు మొక్కలు మనకు విరివిరిగా కనిపిస్తూనే ఉంటాయి. పచ్చని ఆకులతో, పసుపు రంగు పూలతో చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి ఈ తంగేడు మొక్కలు.
తంగేడు పువ్వులు అందంగా గుత్తు గుత్తులుగా పూస్తాయి. స్త్రీలు గనక తంగేడు చెట్టు ముందు నుండి వెళ్తూ వాటి పువ్వులను కోసి తలలో పెట్టుకోకపోతే ఆ చెట్టు మనల్ని తిడుతుందని పూర్వకాలంలో చాలా మంది భావించేవారు. తంగేడు చెట్టు కలిగి ఉండే ఔషధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. తేలు కాటు విషాన్ని హరించే శక్తి తంగేడు మొక్కకు ఉంటుంది. తేలు కాటుకు గురయినప్పుడు తంగేడు మొక్క ఆకులను సేకరించి ముద్దగా నూరి ఆ రసాన్ని తేలు కాటు వేసిన చోట పిండి ఆ ముద్దను తేలు కాటుపై ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల తేలు విషం నశిస్తుంది. తంగేడు చెట్టు ఆకుల రసాన్ని అరి కాళ్లకు రాస్తూ మర్దనా చేయడం వల్ల అరి కాళ్ల మంటలు తగ్గుతాయి. ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలి కారణంగా మనలో చాలా మంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ షుగర్ వ్యాధికి ఔషధంగా తంగేడు మొక్క పని చేస్తుందని మనలో చాలా మందికి తెలియదు. 10 నుండి 15 తంగేడు పువ్వుల రెక్కలను సేకరించి వాటిని ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి వడకట్టాలి. ఈ నీటిని రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల షుగర్ వ్యాధి నుండి మనం త్వరితగతిన ఉపశమనాన్ని పొందవచ్చు. ఇలా తంగేడు పూల కషాయాన్ని తాగిన తరువాత ఒక గంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు.
తంగేడు కొమ్మలతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల సమస్త దంత సమస్యలు తొలగిపోతాయి. రేచీకటిని తగ్గించడంలో తంగేడు ఎంతగానో ఉపయోగపడుతుంది. తంగేడు ఆకుల రసంలో తెల్ల ఉల్లిపాయలను కలిపి నెయ్యిలో ఉడికించి ఆ మిశ్రమాన్ని కొద్ది మోతాదులో తీసుకుంటూ ఉండడం వల్ల రేచీకటి సమస్య క్రమంగా తగ్గుతుంది. చిన్న పిల్లలు కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు వారికి తంగేడు మొక్క బెరడుతో చేసిన కషాయాన్ని తాగించడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది. విరిగిన, బెణికిన ఎముకలను సరి చేయడంలో కూడా తంగేడు మొక్క మనకు ఉపయోగపడుతుంది. తంగేడు మొక్క ఆకులను మెత్తగా నూరి అందులో కోడి గుడ్డు తెల్ల సొనను కలిపి విరిగిన ఎముకలపై పట్టుగా వేసి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. తంగేడు మొక్క లేత ఆకులను నమలడం వల్ల నోటిపూత సమస్య తగ్గుతుంది. ఈ విధంగా తంగేడు మొక్క మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.