Cracked Heels : మనలో చాలా మంది పాదాల పగుళ్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. పాదాలు పగలడం, పాదాలు తేమ లేకుండా పొడిబారడం, పాదాలను శుభ్రపరచకపోవడం వంటి కారణాల వల్ల పాదాలు పగుళ్ల సమస్య వస్తుంది. అంతేకాకుండా పోషకాహార లోపం, పొడి నేల మీద ఎక్కువ సమయం నిలబడుతూ ఉండడం, వయస్సు పెరగడం, మధుమేహం కారణంగా కూడా పాదాల పగుళ్లు ఏర్పడతాయి. కొంత మంది ఈ పాదాల పగుళ్లను అస్సలు పట్టించుకోరు. దాని వల్ల సమస్య తీవ్రమై నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. పాదాలు కూడా చూడడానికి అందవిహీనంగా ఉంటాయి.
పాదాల పగుళ్ల సమస్య తీవ్రతరం కాకుండా ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మన ఇంట్లో పెంచుకునే కరివేపాకు, గోరింటాకు మొక్కలను ఉపయోగించి మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. కరివేపాకు ప్రతి ఇంట్లో ఉండనే ఉంటుంది. దీనిని ప్రతిరోజూ మనం వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. కరివేపాకు కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాక గోరింటాకు కూడా మనకు లభ్యమవుతూనే ఉంటుంది. గోరింటాకు.. పాదాలు మెత్తగా, మృదువుగా ఉండేలా చేయడంలో సహాయడుతుంది. ఈ రెండింటినీ ఉపయోగించి మనం పాదాల పగుళ్లను నయం చేసుకోవచ్చు.
కరివేపాకును, గోరింటాకును ఉపయోగించి మనం ఈ సమస్యను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా ఉండే కరివేపాకును, గోరింటాకును సేకరించి శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో లేత మర్రి ఊడల నుండి తీసిన పాలను కలిపి రాత్రి పడుకునే ముందు పాదాలకు పట్టించి ఉదయాన్నే కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మృత కణాలు తొలగిపోయి పాదాల పగుళ్లు తగ్గుతాయి. పాదాలు మెత్తగా, మృదువుగా, అందంగా తయారవుతాయి. ఇలా ఒక వారం రోజుల పాటు క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల పాదాల పగుళ్లు తగ్గి, పాదాలు పొడిబారకుండా అందంగా ఉండేలా మార్చుకోవచ్చు. పాదాలపై ఉండే చర్మం మృదువుగా మారుతుంది. కాంతివంతంగా కనిపిస్తుంది. పగుళ్లు ఏర్పడకుండా ఉంటాయి.