Vamu Aaku : వామాకు.. మనం పెరట్లో, కుండీల్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే ఔషధ మొక్కలల్లో ఇది కూడా ఒకటి. ఈ మొక్క ఆకులు వాము వాసనను కలిగి ఉంటాయి. ఈ మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు. నేలలో, కుండీల్లో కూడా చాలా సులభంగా పెరుగుతుంది. ముదిరిన ఆకులు తెంపే కొద్ది ఈ మొక్కకు కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. వామాకుతో ఎక్కువగా బజ్జీలను తయారు చేస్తూ ఉంటారు. అలాగే కొందరు దీనితో రోటి పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటారు. చక్కటి వాసనతో పాటు వామాకును వండుకుని తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వామాకు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వామాకును వండుకుని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వామాకును వాడడం వల్ల అధిక రక్తపోటు సమస్య తగ్గు ముఖం పడుతుంది.
వామాకులో ఉండే థైమాల్ అనే రసాయనం రక్తనాళాలు వ్యాకోచించేలా చేసి రక్త సరఫరాను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్తనాళాలు వ్యాకోచించడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గడంతో పాటు అధిక రక్తపోటు సమస్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుంది. రక్తపోటుతో బాధపడే వారు వామాకును వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే దీనిని వాడడం వల్ల అలర్జీలు తగ్గు ముఖం పడతాయి. యాంటీ ఇన్ ప్లామేటరీగా కూడా వామాకు పని చేస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి న్యుమోనియా వంటి సమస్యలు తలెత్తకుండా చేయడంలో వామాకు మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను తగ్గించడంలో కూడా వామాకు సహాయపడుతుంది. మూత్రంలో ఉండే క్యాల్షియం రాళ్ల లాగా మారకుండా చేయడంలో వామాకులో ఉండే కొన్ని రకాల ప్రోటీన్స్ దోహదపడతాయి.
కనుక వామాకును తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుంది. అలాగే వాముకును తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ప్రేగు పూతలు, అల్సర్ వంటి వాటిని తగ్గించి తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేయడంలో వామాకు ఎంతో తోడ్పడుతుంది. అలాగే వామాకుకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు కూడా ఉన్నాయి. వామాకును తీసుకోవడం వల్ల వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. అంతేకాకుండా ఈ వామాకును తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్తంలో ఉండే ట్రైగ్లిజరాయిడ్ స్థాయిలు కూడా తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ విధంగా వామాకు మనకు ఎంతగానో సహాయపడుతుందని దీనితో బజ్జీలకు బదులుగా పచ్చడిని చేసి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.