Pooja Room : ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన చేయడం చాలా ముఖ్యం. ప్రతి ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేస్తూ ఉండాలి. పూజ విషయంలో, పూజ గది విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని కూడా కచ్చితంగా పాటించాలి. ఇంట్లో దేవుడి ఫొటోలకి, ప్రతిమలకు మనం పూజలు చేస్తాము. ఆర్థిక పరిస్థితిని బట్టి దేవుడి అల్మారాని పెట్టుకుంటూ ఉంటారు. స్థలం ఎక్కువగా ఉంటే ప్రత్యేకమైన గదిని కట్టిస్తారు. అయితే దేవుడి గదిని ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసుకోకూడదు.
దేవుడి గది కోసం కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలి. దేవుడి గదిని ప్రత్యేకంగా కట్టుకోలేకపోతే ఈశాన్యం గదిని అందుకు వాడుకోవచ్చు. ఈశాన్యం గదిలో ఎత్తుగా అరుగు కానీ, మందిరం కానీ కట్టి నిర్మించకూడదు. ఈశాన్యం గదిలో దక్షిణ, పశ్చిమ నైరుతిలలో పీట వేసి లేదంటే వస్త్రం వేసి దేవుళ్ళని పెట్టుకోవచ్చు. దేవుడి ఫోటోలని గోడకి తగిలించినట్లయితే దక్షిణ, పశ్చిమ గోడలకు తగిలించడం మంచిది.
ఈశాన్యం గదిలో దక్షిణ, పశ్చిమ గోడలలో అల్మారా పెట్టుకుని దేవుడిని పెట్టుకోవచ్చు. ఈశాన్యం గదిని దేవుడి గదిగా ఏర్పాటు చేయలేకపోతే తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, వాయువ్యలలో దేవుడి గదిని పెట్టుకోవచ్చు. నైరుతి, ఆగ్నేయ గదులని దేవుడు గదులుగా పెట్టకండి. ఒకవేళ కనుక దేవుడి గదిని ప్రత్యేకంగా పెట్టుకో లేకపోతే ఏ గదిలో అయినా, అల్మారాలో కానీ పీట మీద కానీ దేవుడి పటాలు పెట్టి పూజించొచ్చు.
ధ్యానం చేసే అలవాటు ఉన్నవాళ్లు తూర్పు అభిముఖంగా ఉండి, ధ్యానం చేస్తే మంచిది. అయితే పూజ గదికి ఎటువైపు కూడా బాత్ రూమ్‌లు, టాయిలెట్లు ఉండకూడదు. పూజగది పైన కూడా టాయిలెట్లు ఉండకూడదు. తూర్పు, ఉత్తర దిక్కుల్లో పూజగదిని ఏర్పాటు చేసుకోవడం వలన ఎలాంటి దోషం ఉండదు.