మహాశివుడు లింగరూపంలో ఉద్భవించిన పరమ పవిత్రమైన రోజే మహా శివరాత్రి. ఇదే రోజున శివ పార్వతుల కల్యాణం కూడా జరిగింది. ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రులన్నింటి కన్నా సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాశివరాత్రి చాలా అద్భుతమైందని, శక్తివంతమైందని చెబుతారు. ఇదే రోజున శివునికి అభిషేకం చేసినా, అర్చన చేసినా చాలా పుణ్యం వస్తుందని అంటారు. అదేవిధంగా రోజంతా ఉపవాసం ఉండి రాత్రి పూట శివ భజనతో జాగారం చేస్తే ఎన్నో జన్మల పుణ్య ఫలం దక్కుతుందని విశ్వసిస్తారు. అయితే శివరాత్రి నాడు మాత్రమే కాదు, ఏ సమయంలో శివున్ని పూజించినా పలు నియమాలు ఉంటాయి. శివాలయానికి వెళ్లినప్పుడు శివున్ని ఎలా దర్శించుకోవాలో, ఏమేం పూజలు చేయాలో మీకు తెలుసా..? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
శివాలయానికి వెళ్లగానే శివుడి కన్నా ముందుగానే నందీశ్వరున్ని ప్రార్థించాలి. ఆయనకు పూజ చేశాక నేతితో గానీ, నువ్వుల నూనెతో గానీ దీపం వెలిగించాలి. అనంతరం మనసారా ప్రార్థించాలి. అలా చేస్తే భక్తులు కోరుకున్నవి నెరవేరుతాయట. నందీశ్వరుడు విజ్ఞానానికి ప్రతీక అని, విద్యార్థులు ఆయన్ను పూజిస్తే విద్వాంసులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి. అయితే నందీశ్వరుడికి దీపం వెలిగించాక భక్తులు తమ కోరికలను ఆయన చెవిలో చెప్పాలి. వాటిని ఇతరులతో పంచుకోకూడదు. అలా చేస్తే అవి నెరవేరవట. నందీశ్వరునికి పూజ చేశాక శివాలయంలోకి వెళ్లి నంది కొమ్ముల గుండా శివున్ని దర్శించుకోవాలి. అనంతరం శివలింగానికి రుద్రాభిషేకం చేస్తే మంచి జరుగుతుంది. దీని ద్వారా మనసులో ఉన్న మలినాలు తొలగిపోతాయని నమ్ముతారు.
శివ పూజ చేసేటప్పుడు పంచాక్షరి మంత్రం పఠించాలి. న, మ, శి, వా, య వచ్చేలా ఓం నమఃశివాయ అని శివున్ని ప్రార్థించాలి. దీంతో శివసాయుజ్యం ప్రాప్తిస్తుందట. మృత్యువు భయం పోవాలన్నా, మోక్షం కావాలనుకున్నా ఈ మంత్రాన్ని జపించాలి. దీన్నే త్రయంబక మంత్రం, రుద్ర మంత్రం, మృత సంజీవని మంత్రం అని కూడా పిలుస్తారు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్.. అని జపించాలి. శివునికి ఉన్న పేర్లను అనుసరిస్తూ సాగే స్తోత్రం ఇది. దీన్ని చదివితే ఎన్నో వేల జన్మల పుణ్యం లభిస్తుందట.