సాధారణంగా మనం ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం మన ఇంట్లో ఉన్న పూజగదిలో పూజలు చేస్తుంటాము. ఈ విధంగా ప్రతి రోజూ పూజలు చేస్తే మన జీవితంలో ఏర్పడిన కష్టాలను ఆ దైవం తొలగించి మనకు అష్టైశ్వర్యాలను కలిగించాలని ప్రార్థిస్తాము. ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే పూజలో కొన్ని వస్తువులను ఉపయోగించడం వల్ల మన ఇంట్లో ఉన్న చెడు వాతావరణం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అయితే మన పూజ గదిలో ఉండాల్సిన వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
మన ఇంట్లో పూజ గదిలో తప్పకుండా ఉండాల్సిన వస్తువులలో శంఖం ఒకటి. పురాణాల ప్రకారం శంఖం లక్ష్మీదేవితో పాటు సముద్రం నుంచి పుట్టింది. కనుక శంఖాన్ని కూడా లక్ష్మీదేవి గానే భావించి పూజలు చేస్తారు. ఈ విధంగా పూజ గదిలో శంఖం ఉండటం శుభపరిణామం. పూజ అనంతరం శంఖం ఊదటం వల్ల మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి.
పూజ సమయంలో పూజ గదిలో గంట తప్పనిసరి. పూజ చేస్తున్న సమయంలో గంట కొట్టడం వల్ల మన ఏకాగ్రత మొత్తం స్వామి వారిపై, పూజపై ఉంటుంది. ఈ క్రమంలోనే మన ఇంట్లో ఆవహించి ఉన్న దృష్టశక్తులు తొలగిపోతాయి. నెమలి ఫించాన్ని పూజ గదిలో ఉంచడం ఎంతో శుభసూచకం. నెమలి ఈకలను పూజగదిలో ఉంచటం వల్ల మన సంపద పెరుగుతుంది.
అదేవిధంగా మన పూజ గదిలో ఉండాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు కలశం. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఒక రాగి చెంబులో నీటిని నింపి పూజగదిలో ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని చెట్లకు పోయడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.