మనం ఎలా ఉండాలో మనకి తెలుసు అనే అనుకుంటాం చాలాసార్లు. కానీ నిజంగా కష్టం వచ్చినప్పుడే ఎటూ తేల్చుకోలేకపోతాం. ఒక్కోసారి ఆ సమస్యలకి పరిష్కారం మనచుట్టూనే ఉంటుంది. మన పురాణాల రూపంలో. పురాణాలను పుక్కిటి పురాణాలని నిన్నమొన్నటి వరకూ పక్కన పడేశాం. కానీ ఇప్పుడు వాటిప్రాశస్త్యాన్ని కొద్దికొద్దిగా తెలుసుకుంటున్నాం.ఇపుుడైతే పర్సనాలిటీ డెవలప్మెంట్, క్రైసెస్ మేనేజ్మెంట్లు, అదే అప్పుడు మునులు, రుషులు చూపించిన మార్గాలు. అలాంటి మార్గాలలో ఒకటి మహా మృత్యుంజయ మంత్రాన్ని మనకి అందించిన మహర్షి మార్కండేయ చూపించిన జీవిత మార్గం.
సరైన స్నేహం..
అవును.. నీ స్నేహితులే నీ వ్యక్తిత్వం.. నువ్వు నీ స్నేహితులతో గడిపే సమయమే నీ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది.. ఉరకలేసే ఉత్సాహం, పాజిటివ్ దృక్పథం ఉన్న స్నేహితులు ఎలా అయితే నీలో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపుతారో.. నెగిటివ్ ఆలోచనలు, నిర్లిప్తత, నిరుత్సాహంలో ఉండే వ్యక్తులు నిన్ను కూడా తెలియని దుఃఖంలో కూరుకుపోయేలా చేయగలరు.
పుణ్యక్షేత్ర దర్శనం..
ఇదేమీ అబద్ధం, నవ్వులాటా కాదు.. నిజం. మతం ఏదయినా గానీ మనలో పాజిటివ్ థింకింగ్ ను పెంపొందిస్తుంది.. పుణ్యక్షేత్ర దర్శనం, అక్కడి పుణ్య నదులలో స్నానం, కనిపించే భక్తి, వినిపించే ప్రార్థనలు మనలో కొత్త శక్తిని కలిగిస్తాయి.
సాత్వికత..
ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచనని పెంపొందించుకునే మార్గమే సాత్వికత. నియమం నిబద్ధతని ఇస్తుంది.. ఆ నిబద్ధత లక్ష్యం దిశగా ఉండే నీ మార్గాన్ని సుగమం చేస్తుంది.. నియమమైన ఆహారం శరీరానికి ఆరోగ్యాన్నిస్తే.. ధ్యానం, దానం మనసుకి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తాయి.. సో.. ఒక్కసారి ప్రయత్నిద్దాం.. పోయేదేముంది.