Ramya Krishnan : 1990 దశాబ్దంలో కుర్రకారు మదిలో రమ్యకృష్ణకి ఉండే క్రేజే వేరు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో జతకట్టి ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. రమ్యకృష్ణ నటన గురించి వేరే చెప్పనవసరం లేదు. నీలాంబరి, శివగామి లాంటి ఎన్నో పాత్రలను అవలీలగా పోషించగలదు. అప్పట్లో రమ్య కృష్ణ సినిమా వస్తుందంటే చాలు కుర్రకారు థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. ప్రేక్షకులలో రమ్యకృష్ణకు ఇంత ఆదరణ లభించడానికి ఆమె కెరీర్ ని మలుపుతిప్పి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించడానికి కారణమైన పది చిత్రాలు ఏంటో తెలుసుకుందాం.
కె విశ్వనాథ్ దర్శకత్వంలో భానుచందర్ హీరోగా, అక్కినేని నాగేశ్వరావు, మురళీమోహన్ ప్రధానపాత్రలలో నటించిన చిత్రం సూత్రధారులు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 1990లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అల్లుడుగారు చిత్రంతో రమ్యకృష్ణ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పట్లో ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన నరసింహ చిత్రంలో లేడీ విలన్ గా నీలంబరి పాత్రలో అందరి దృష్టినీ ఆకర్షించింది రమ్యకృష్ణ.
మోహన్ బాబు సరసన అల్లరి మొగుడు, సోగ్గాడి పెళ్ళాం చిత్రాలతో హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో గ్లామరస్ రోల్ లో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత హలో బ్రదర్, ఘరానా బుల్లోడు చిత్రంలో నాగార్జునకు జోడీగా నటించి సక్సెస్ ను అందుకుంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు చిత్రం రమ్యకృష్ణ కెరీర్ లో ది బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. నిజంగా అమ్మవారు అంటే రమ్యకృష్ణ లాగానే ఉంటుందేమో అనే విధంగా ప్రేక్షకులను మెప్పించింది.
శ్రీకాంత్ సరసన ఆహ్వానం చిత్రంలో డబ్బు పిచ్చితో పక్కదారి పడుతున్న భర్తను సరైన దారిలో తెచ్చుకున్న భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించింది. ఈ చిత్రంలో భార్యాభర్తల సంబంధంలో మాంగల్యానికి ఉన్న విలువ గురించి తెలియజేసే విధానంలో రమ్యకృష్ణ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రంలో శివగామిగా నటించి, తన అద్భుతమైన నటనతో అందర్నీ ఆకట్టుకుంది రమ్యకృష్ణ. ఈ 10 చిత్రాలు రమ్యకృష్ణ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలని చెప్పవచ్చు.