Cumin : జీలకర్ర..దీనిని మనం వంటల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. జీలకర్రను వాడడం వల్ల వంటల రుచి పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా జీలకర్ర ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుందని మనందరికి తెలుసు. మనకు నల్ల జీలకర్ర, తెల్ల జీలకర్ర అనే రెండు రకాల జీలకర్ర లభిస్తుంది. నల్ల జీలకర్రను సాజీరా అని కూడా అంటారు. ఇవి రెండూ కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిని అనేక గృహ చికిత్సలకు వాడుతూ ఉంటారు. జీలకర్ర ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. జీలకర్ర చెట్టు సుమారు 30 నుండి 50 సెంటిమీటర్ల ఎత్తు పెరుగుతుంది. జీలకర్రను వంటల్లోనూ, ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. హిందూ వివాహ వేడుకల్లో జీలకర్ర, బెల్లాన్ని తల మీద పెట్టడం ఒక ముఖ్యమైన ఘట్టం.
జీలకర్ర వాడితే చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయని తాజా పరిశోధనల్లో తేలింది. జీలకర్ర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కడుపులో నులి పురుగులను నివారించడంలో జీలకర్ర దివ్యౌషధంగా పని చేస్తుంది. మజ్జిగలో ఇంగువను, జీలకర్రను, సైంధవ లవణాన్ని కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. జీలకర్రతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. బీపీ, షుగర్ వంటి వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. శరీరం పై వచ్చే తామర, తెల్ల మచ్చలు, బొల్లి వంటివి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఇటువంటి చర్మ వ్యాధులను త్వరిత గతిన గమనించి వాటి బారి నుండి బయట పడడం చాలా అవసరం.
ఈ చర్మ వ్యాధులను మనం జీలకర్రను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. అలర్జీలను నయం చేయడంలో కూడా జీలకర్ర ఉపయోగపడుతుంది. అదే విధంగా జీలకర్రను వేయించి పొడిగా చేయాలి. ఈ పొడికి సైంధవ లవణాన్ని లేదా ఉప్పును కలిపి రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల స్త్రీలల్లో గర్భాశయ బాధలు నెమ్మదిస్తాయి. ఈ పొడిని నీటిలో లేదా మజ్జిగలో కలిపి తీసుకోవాలి. అదేవిధంగా జీలకర్రను వేయించి పొడిగా చేయాలి. తరువాత అందుకు సమానంగా వేయించని జీలకర్రను పొడిగా చేసి కలపాలి. తరువాత దీనికి చక్కెరను, ఆవు నెయ్యిని కలిపి కుంకుడు గింజంత పరిమాణంలో మాత్రలుగా చేసుకోవాలి.
ఈ మాత్రలను రోజుకు రెండు పూటలా రెండు చొప్పున వేసుకోవాలి. దీని వల్ల మూత్ర సంబంధిత వ్యాధులు, మూత్రంలో వేడి, మూత్రంలో మంట, పచ్చదనం వంటివి తగ్గుతాయి. ఎప్పుడు నీరసం, పైత్యంతో బాధపడుతున్న వారు జీలకర్రను లేదా జీలకర్ర మరియు ధనియాల మిశ్రమాన్ని కానీ తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనియాలు, జీలకర్రను సమపాళ్లల్లో తీసుకుని విడివిడిగా వేయించి పొడిగా చేయాలి. ఈ పొడికి తగినంత సైంధవ లవణాన్ని కలిపి అన్నం, మజ్జిగ, అల్పాహారాల్లో కలిపి వాడుకుంటే ప్రేగులు శుభ్రపడి రోగాలకు దూరంగా ఉంటారు. జీలకర్రను నిమ్మరసంతో కలిపి సూర్యోదయ సమయాన, సూర్యాస్తమయ సమయాన రెండు పూటలా తింటే తల తిరగడం, కడుపులో వేడి వంటి మొదలగు పైత్య రోగాలు తగ్గుతాయి.
అర తులం జీలకర్రను ఒక గంటెలో తీసుకుని మాడే వరకు వేయించాలి. తరువాత అందులో నీళ్లు పోసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి నాలుగు గంటలకొకసారి తీసుకుంటూ ఉంటే నీళ్ల విరోచనాలు తగ్గుతాయి. ఇన్ని ఔషధ గుణాలు ఉన్న జీలకర్రను తప్పకుండా ఆహారంలో తీసుకోవాలని, దీనిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.