Atukula Laddu : అటుకులను సాధారణంగా చాలా మంది మిక్చర్ రూపంలో తయారు చేసుకుని తింటుంటారు. ఇది ఎంతో రుచిగా కూడా ఉంటుంది. టైమ్ పాస్ కోసం ఏమీ లేనప్పుడు అటుకుల మిక్చర్ భలేగా ఉపయోగపడుతుంది. అయితే అటుకులతో ఇంకా అనేక వంటకాలను చేసుకోవచ్చు. వాటిల్లో లడ్డూలు కూడా ఒకటి. అటుకులతో చేసే లడ్డూలు ఎంతో రుచిగా ఉంటాయి. తయారు చేయడం కూడా సులభమే. అటుకుల లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకుల లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు..
అటుకులు – ఒక కప్పు, బెల్లం, నెయ్యి – అర కప్పు చొప్పున, బాదం, జీడిపప్పు తురుము – రెండు పెద్ద టీస్పూన్లు, యాలకుల పొడి – అర టీస్పూన్.
అటుకుల లడ్డూలను తయారు చేసే విధానం..
పాన్‌లో అటుకులను వేసి బాగా వేయించాలి. వీటిని చల్లార్చి మిక్సీ జార్‌లో వేసి పొడి చేసుకోవాలి. దీన్ని పెద్ద గిన్నెలోకి తీసుకుని బెల్లం తురుము, నెయ్యి, బాదం తురుము వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా యాలకుల పొడి జత చేసి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. బాదంతో గార్నిష్ చేసుకుంటే ఆహా అనిపించే అటుకుల లడ్డూలు రెడీ అయినట్లే. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.