Pomegranate Peel : సాధారణంగా ఎవరైనా సరే పండ్లను తిని వాటి తొక్కలను పడేస్తుంటారు. కానీ కొన్ని పండ్లకు చెందిన తొక్కల్లోనూ ఔషధ గుణాలు, పోషక విలువలు ఉంటాయి. అందువల్ల వాటితోనూ ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కనుక ఆ తొక్కలను పడేయకూడదు. ముఖ్యంగా దానిమ్మ పండ్లకు చెందిన తొక్కలను అస్సలు పడేయకండి. వాటితో ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే ఇక మీరు వాటిని విడిచిపెట్టరు.
దానిమ్మ పండ్లను చూడగానే ఎర్రగా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వాటిల్లోని విత్తనాలు కూడా అదే రంగులో ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. అయితే దానిమ్మ గింజలను తిన్న తరువాత ప్రతి ఒక్కరూ ఆ పండు తొక్కలను పడేస్తారు. కానీ ఇకపై అలా చేయకండి. వాటితో అనేక లాభాలను పొందవచ్చు.
దానిమ్మ పండు తొక్కలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తాన్ని వృద్ధి చేస్తుంది. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. రక్తం తక్కువగా ఉన్నవారు దానిమ్మ పండు తొక్కను తీసుకోవచ్చు.
దానిమ్మ పండు తొక్క వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. దానిమ్మ పండు తొక్కలో విటమిన్లు ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు, కాల్షియం, ఐరన్, విటమిన్ బి6, మెగ్నిషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ తొక్కలతో మనకు ఉండే వ్యాధులను తగ్గించుకోవచ్చు. పోషణ లభిస్తుంది.
దానిమ్మ పండు తొక్కలను నీడలో ఎండబెట్టాలి. అనంతరం పొడి చేయాలి. ఆ పొడిని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని రోజూ ఉపయోగించుకోవచ్చు.
దానిమ్మ పండు తొక్కల పొడి, సైంధవ లవణం, పుదీనా నూనె రెండు చుక్కలు కలిపి దంతాల పొడిగా తయారు చేసి రోజూ ఉపయోగించవచ్చు. దీంతో దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. దంతాలు, చిగుళ్ల సమస్యలు పోయి నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు తెల్లగా మారుతాయి. అయితే సైంధవ లవణం, పుదీనా నూనె లేకపోతే దానిమ్మ పండు తొక్కల పొడిలో నీళ్లను కలిపి కూడా ఉపయోగించవచ్చు. దీంతోనూ పైన తెలిపిన లాభాలు కలుగుతాయి.
దానిమ్మ పండు తొక్కలను నీటిలో వేసి మరిగించాలి. బాగా మరిగించాక వచ్చే మిశ్రమాన్ని రోజుకు ఒక్కసారి ఒక కప్పు మోతాదులో తాగుతుండాలి. దీంతో కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
దానిమ్మ పండు తొక్కను దంచి గాయాలు, పుండ్లపై పట్టీలా వేసి కట్టు కట్టాలి. దీంతో అవి త్వరగా నయమవుతాయి.
దానిమ్మ పండు తొక్కల పొడిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ఫేస్ ప్యాక్‌లా ఉపయోగించవచ్చు. ముఖానికి అప్లై చేశాక అర గంట పాటు ఆగి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేయవచ్చు. దీంతో మొటిమలు, మచ్చలు పోతాయి. ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
దానిమ్మ తొక్కలను ఆవనూనెతో కలిపి దంచాలి. తరువాత ఆ మిశ్రమాన్ని పలుచని వస్త్రంలో వడకట్టాలి. అనంతరం దాన్ని వక్షోజాల మీద రాస్తుండాలి. రాత్రి పూట ఇలా చేసి ఉదయం స్నానం చేయాలి. దీంతో జారిపోయిన వక్షోజాలు దృఢత్వాన్ని పొందుతాయి.
దానిమ్మ పండు తొక్కల పొడి, పెరుగు కలిపి ముఖానికి రాసి ఆరిపోయాక కడిగేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయాలి. దీని వల్ల ముఖం మృదువుగా మారుతుంది. పొడిదనం తగ్గుతుంది. తేమగా ఉంటుంది.
దానిమ్మ పండు తొక్కలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. దీంతో టాన్సిల్స్, నోట్లో ఉండే అల్సర్లు వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.
రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ దానిమ్మ పండు తొక్కల పొడిని కలిపి నిద్రించే ముందు తాగాలి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గడమే కాక, కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. శరీరంలో రక్త ప్రసరణ మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.