Banana Peel : మనలో చాలా మంది ఇష్టంగా తినే పండ్లల్లో అరటి పండు కూడా ఒకటి. ఇది మనకు దాదాపు అన్ని కాలాల్లో అలాగే చాలా తక్కువ ధరలో లభిస్తూ ఉంటుంది. అరటి పండులో కూడా చాలా రకాలు ఉంటాయి. దీనిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. అరటి పండును మనం తరచూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. సాధారణంగా ఒక అరటి పండు 120 గ్రాముల నుండి 200 గ్రాముల వరకు తూగుతాయి. ఈ బరువు వాటి పెంపకం, వాతావరణం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఈ బరువులో 80 శాతం లోపల ఉన్న గుజ్జు కాగా 20 శాతం పైన తొక్క ఆక్రమించుకుంటుంది. అరటి పండ్లల్లో రంగు, రుచి, వాసన అనే అంశాలు పక్వానికి వచ్చే దశలో ఉండే ఉష్ణోగ్రతల మీద ఆధారపడి ఉంటాయి. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అరటి పండ్లు పాడైపోతాయి. కనుక వీటిని ఫ్రిజ్ లలో ఉంచకూడదు. అరటి పండ్లను రవాణా చేసేటప్పుడు కూడా 13.6 డిగ్రీల కంటే కూడా ఎక్కువ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకుంటారు. అరటిపండులో పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు, చక్కెరలు ఎక్కువగా ఉంటాయి.
100 గ్రాముల అరటిపండులో 20 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1 గ్రాము మాంసకృత్తులు, 0.2 గ్రాముల కొవ్వు పదార్థాలు, 80 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. అరటి పండు త్వరగా జీర్ణమవుతుంది. దీనిని తినడం వల్ల మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మనకు దాదాపు 50 రకాల అరటి పండ్లు లభిస్తాయి. అయితే మనం సాధారణంగా అరటి పండును తిని పైన తొక్కను పాడేస్తూ ఉంటాం. అరటి తొక్క ఎందుకు పనికి రాదని మనలో చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ ఆ తొక్కతోనే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయట.
అరటి తొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పండులో కంటే అరటి పండు తొక్కలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. అరటి పండు తొక్కలో ఎక్కువ శాతం విటమిన్స్, మినరల్స్ ఉన్నాయని వారు చెబుతున్నారు. అరటి పండు తొక్కతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలపై ఉండే పసుపుదనం తొలగిపోయి దంతాలు తెల్లగా మారతాయి. ఇలా చేయడం వల్ల ఇతర దంత సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా మొటిమలతో బాధపడే వారు అరటి పండు తొక్కను ఉపయోగించడం వల్ల చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. మొటిమలపై అరటి పండు తొక్కతో రుద్దడం వల్ల మొటిమలు ఒక్క రాత్రిలోనే మటుమాయం అవుతాయి. అలాగే అరటి పండు తొక్కను గుజ్జుగా చేసి అందులో కోడిగుడ్డులోని తెల్ల సొనను కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం పై ఉండే ముడతలు తొలగిపోవడంతో పాటు చర్మం పొడిబారకుండా కూడా ఉంటుంది.
నొప్పులు, వాపులను తగ్గించడంలో కూడా అరటి పండు తొక్క మనకు సహాయపడుతుంది. అరటి తొక్కను గుజ్జుగా చేసి అందులో నూనెను కలిపి నొప్పులు, వాపులపై మర్దనా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. దోమ కాటు వల్ల వచ్చే దురదలు, అలర్జీలపై అదే విధంగా సోరియాసిస్ వల్ల కలిగే దురదలపై అరటి పండు తొక్కను రాయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఈ విధంగా అరటి పండు తొక్క కూడా మనకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.