Green Tea : అధిక బరువు.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అలాగే చేసే పనితో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఇది కూడా ఒకటి. కారణాలేవైనప్పటికీ ఈ సమస్య బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం చేసే సమయం లేక చాలా మంది సులభంగా బరువు తగ్గే పద్దతులను ఎంచుకుంటున్నారు. సులభంగా బరువు తగ్గడానికి చాలా మంది పాటిస్తున్న పద్దతుల్లో గ్రీన్ టీ తాగడం కూడా ఒకటి. గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారనడంతో అందరూ ఈ పద్దతినే ఎంచుకుంటున్నారు. ఇలా అధిక బరువుతో బాధపడే వారితోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న కారణం చేత ఇతరులు కూడా దీనిని తాగుతున్నారు.
అయితే గ్రీన్ టీని తాగడం వల్ల బరువు తగ్గడంతోపాటు ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీనిని అతిగా మాత్రం తీసుకోకూడదు. గ్రీన్ టీ ని అధికంగా తాగడం వల్ల మనం దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. అతి సర్వతా వర్జయేత్ అనే నానుడి ఈ గ్రీన్ టీ కి సరిగ్గా సరిపోతుంది. గ్రీన్ టీ ని అతిగా తాగడం వల్ల కడుపు నొప్పి, కండరాల నొప్పి, అలర్జీ వంటి ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటితోపాటు గ్రీన్ టీ ని మోతాదుకు మించి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకుండా పోతాయి. గుండె కొట్టుకునే వేగంలో మార్పులు చోటుచేసుకుంటాయి.
గ్యాస్, కడుపులో అసౌకర్యంగా ఉండడం వంటి జీర్ణసంబంధిత సమస్యలు కూడా వస్తాయి. అంతేకాకుండా దీనిని అధికంగా తాగడం వల్ల తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ గ్రీన్ టీ ని అధికంగా తాగడం వల్ల కాలేయం అనారోగ్యానికి గురి అయ్యి కామెర్ల వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా మోతాదుకు మించి గ్రీన్ టీ ని తాగడం వల్ల రక్తస్రావానికి సంబంధించిన రుగ్మతలు కూడా వస్తాయి. అలాగే మనం తీసుకునే ఆహార పదార్థాల నుండి ఐరన్ ను గ్రహించే శక్తిని శరీరం క్రమంగా కోల్పోతుంది. దీంతో క్రమంగా ఐరన్ లోపం వల్ల వచ్చే సమస్యలు తలెత్తుతాయి.
అంతేకాకుండా గ్రీన్ టీ ని అధికంగా తాగితే మన ఎముకల ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ విధంగా అనేక రకాల దుష్ప్రభావాలు ఉన్నాయి కనుక గ్రీన్ టీ ని ఎక్కువగా తీసుకోకూడదు. త్వరగా బరువు తగ్గాలనుకునే కారణం చేత దీనిని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక గ్రీన్ టీని రోజుకు రెండు కప్పులకు మించి తాగరాదు. తాగితే దుష్పరిణామాలు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.