Hair Fall Foods : ప్రస్తుత కాలంలో చిన్నా , పెద్దా తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. జుట్టు రాలడానికి ప్రధాన కారణం మన జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా లేకపోవడమే. జుట్టు కుదుళ్లు ధృడంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే జుట్టు రాలడం తగ్గుతుంది. రాలిన జుట్టు స్థానంలో మరో వెంట్రుకను 20 రోజుల్లో పుట్టించే సామర్థ్యం మన జుట్టు కుదుళ్లకు ఉంటుంది. రాలిన జుట్టు స్థానంలో ఉండే జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా లేకపోయినా, ఆ స్థానంలో ఉండే జుట్టు కుదుళ్లు దెబ్బ తిన్నా కొత్త వెంట్రుకను పుట్టించే ప్రక్రియ ఆగిపోతుంది.
మన జుట్టు స్థితి మన జుట్టు కుదుళ్లపై ఆధారపడి ఉంటుంది. మన జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా రక్త ప్రసరణ మన జుట్టుకు సరిగ్గా జరగాలి. దీని వల్ల రక్తంలో ఉండే పోషకాలు మన జుట్టు కుదులకు అందడమే కాకుండా కుదుళ్లల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. ప్రోటీన్స్, ఐరన్, విటమిన్స్, మినరల్స్, విటమిన్ కె వంటి పోషకాలు మన జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువగా అవసరమవుతాయి. ఈ పోషకాలన్నీ మనం తీసుకునే ఆహారం ద్వారా మన శరీరానికి అంది, రక్తం ద్వారా మన జుట్టు కుదుళ్లకు అందుతాయి. కనుక మనం తీసుకునే ఆహారంపైనే మన జుట్టు కుదుళ్ల ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.
మన జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ మనం ఏదైనా ఆకుకూరను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఆకు కూరల్లో మినరల్స్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఈ ఆకు కూరలకు మనం ప్రతి రోజూ తినే కంది పప్పు, శనగ పప్పుతోపాటుగా రాజ్మా గింజలను, సోయా గింజలను, పుచ్చ గింజల పప్పులను చేర్చి తినడం వల్ల మన జుట్టు కుదుళ్లకు కావల్సిన ప్రోటీన్స్, విటమిన్ కె కూడా అందుతాయి. ఈ పప్పులలో అధికంగా ప్రోటీన్స్ ఉంటాయి.
సోయా గింజలు అందుబాటులో లేనప్పుడు సోయా చంక్స్ (మీల్ మేకర్) లని ఆకు కూరలతో కలిపి తినవచ్చు. కనుక ఆకు కూరలకు వీటిని కలిపి తినడం వల్ల మన జుట్టు కుదుళ్లకు కావల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. ప్రతి రోజూ 300 గ్రాముల ఆకు కూరలను తినడం వల్ల జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, రాలిన జుట్టు మళ్ళీ వస్తుంది. జుట్టు చివర్లు చిట్లడం, జుట్టు విరగడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. రక్త హీనత సమస్య ఉన్న వారిలో జుట్టు రాలడాన్ని, జుట్టు ఎదుగుదల లేకపోవడాన్ని మనం ఎక్కువగా చూడవచ్చు. కనుక ఆకు కూరలతోపాటుగా ఈ పప్పులను చేర్చి తినడం వల్ల రక్త హీనత తగ్గి, జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణ ఎక్కువగా జరిగి జుట్టు రాలడం తగ్గడమే కాకుండా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.