Ugadi Pachadi : తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది. ఈ పండగకు ఉన్న ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను తెలుగు వారికి ప్రతేక్యంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ రోజున చేసే ఉగాది పచ్చడికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉగాది పచ్చడి ఆరు రుచుల సంగమం. కారం, తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు వంటి ఆరు రుచుల సంగమమే ఉగాది పచ్చడి. ఈ ఆరు రుచులల్లో కూడా ఒక్కో రుచికి ఒక్కో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నాయి. మన జీవితం కూడా బాధ, సంతోషం, కోపం, భయం, ఆశ్చర్యాల సంగమమే అని ఈ ఉగాది పచ్చడి ద్వారా తెలుసుకోవచ్చు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో, తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఉగాది పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
కారం రుచి కోసం – తగినంత కారం పొడి, తీపి రుచి కోసం – కొద్దిగా బెల్లం, పులుపు రుచి కోసం – తగినంత చింతపండు, వగరు రుచి కోసం – లేత మామిడి కాయ ఒకటి , చేదు రుచి కోసం – కొద్దిగా వేప పూత, ఉప్పు రుచి కోసం – తగినంత ఉప్పు, నీళ్లు – సరిపడా.
ఉగాది పచ్చడి తయారీ విధానం..
ముందుగా చింతపండును నానబెట్టి రసాన్ని తీసి ఉంచుకోవాలి. బెల్లాన్ని, లేత మామిడి కాయను చిన్న ముక్కలుగా చేసుకోవాలి. వేప పూతను నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. ఇప్పుడు మట్టి కుండను కానీ, స్టీల్ పాత్రను కానీ తీసుకొని అందులో మనకు కావల్సిన పరిమాణంలో నీటిని తీసుకోవాలి. ఈ నీటిలో ముందుగా సిద్దం చేసి పెట్టుకున్న బెల్లం ముక్కలను వేసి బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలి. తరువాత చింతపండు రసం, మామిడి కాయ ముక్కలు, వేప పూత, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. దీంతో షడ్రుల ఉగాది పచ్చడి తయారవుతుంది. దీనిని భగవంతుడుకి నైవేద్యంగా సమర్పించిన తరువాత ప్రసాదంగా తీసుకోవాలి. ఇందులో పండ్ల ముక్కలు, డ్రై ఫ్రూట్స్‌ను కూడా వేసుకోవచ్చు. ఇలా ఉగాది పచ్చడిని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ఆయుర్వేదం ప్రకారం.. ఉగాది పచ్చడి అంటే ఆరు రుచుల మేళవింపు కనుక మనం నిత్యం జీవితంలోనూ ఆరు రకాల రుచులు కలిగిన ఆహారాలను రోజూ తినాలన్నమాట. దీంతో అన్ని రుచులు మన శరీరానికి రోజూ అందుతాయి. దీని వల్ల శరీరంలో ఎలాంటి దోషాలు ఉండవు. ఆరోగ్యంగా ఉంటారు. ఇలా రోజూ ఆరు రకాల రుచులను తీసుకోవాలని చెప్పడమే.. ఉగాది పచ్చడి వెనుక ఉన్న ఉద్దేశం.