Over Sweating : మారుతున్న జీవనశైలి, ఆధునిక ఆహారపు అలవాట్లు, పోటీ ప్రపంచంతో ఉరుకలు పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళన వంటి అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఈ అనారోగ్య సమస్యలతో కొన్ని లక్షణాలు బయటపడుతున్నాయి. ఇందులో కొన్ని సాధారణ లక్షణాలే అయినా కొన్ని మాత్రం ప్రమాదకర వ్యాధులకు సంకేతాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడు కూడా మనకు ఎదురయ్యే అన్ని లక్షణాల్ని నిర్లక్ష్యం చేయకూడదు.
శరీరానికి చెమట పట్టడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒంట్లోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి, శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గించడానికి చెమట పట్టడం అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ కొన్నిసార్లు శరీరానికి అధికంగా చెమటపట్టి మహా ఇబ్బంది పెడుతుంది. ఈ లక్షణం అనేది శరీరంలో అంతర్గతంగా జరిగే మార్పుల వల్ల కావచ్చు.
స్త్రీ 40 లేదా 50 ఏళ్ళకు చేరుకున్నప్పుడు పునరుత్పత్తి హార్మోన్స్ క్షీణించడం మొదలవుతుంది. ఋతుక్రమం ఆగి పోవడానికి సంకేతంగా రాత్రి నిద్రపోయే సమయంలో అధిక చెమట పట్టడం అనే సమస్య ఎదురవ్వొచ్చు. మీరు ఏదైనా విషయంపై ఎక్కువగా ఆందోళన, మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నా కూడా అధిక చెమట సమస్య ఎదురవుతుంది.
క్షయ వ్యాధి ఉన్నవారికి కూడా రాత్రి పూట ఎక్కువగా చెమటలు పడుతుంటాయి. ఆప్టియోమైలిటిస్, ఎండో కార్డిటిస్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ ఉన్నవారికి కూడా రాత్రి సమయంలో చెమటలు అధికంగా వస్తుంటాయి. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే లింఫోమా వంటి కొన్ని క్యాన్సర్ వ్యాదులకు చెమటలు పట్టడం అనేది ప్రారంభ లక్షణం. అధిక జ్వరం వచ్చిన సమయంలో ఆస్పిరిన్, ఎసిటమినోపైన్ వంటి జ్వరాన్ని తగ్గించే మాత్రలతో కూడా చెమటలు పడతాయి. ఆరోగ్యానికి ప్రతికూలంగా నిద్రా సమయాన్ని మార్పులు చేసుకునే పరిస్థితులలో కూడా అధిక చెమట సమస్య ఎదురవుతుంది.