Gut Health : మన పొట్ట కూడా ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే మనం తిన్న ఆహారాలు సరిగ్గా జీర్ణమవుతాయి. మానసిక ఆరోగ్యం మరియు శారీరక ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంచడంలో మన పొట్ట కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. అయితే నేటితరుణంలో మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా మన పొట్ట ఆరోగ్యం క్షీణిస్తుంది. మనం తీసుకునే ఆహార పదార్థాలే మన పొట్ట ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో మనం అనేక జీర్ణ సమస్యల బారిన పడాల్సి వస్తుందని, అనేక అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా వారు తెలియజేస్తున్నారు. మన పొట్ట ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాసెస్డ్ ఆహారాలు వండుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటాయని చాలా మంది వీటిని వండుకుని తింటూ ఉంటారు. కానీ వీటిలో కొవ్వులు కలిగి ఉంటాయి.
మన పొట్ట మైక్రో బయోమ్ ను ఇవి తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఫలితంగా జీర్ణ సమస్యలు, వాపు, నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక ప్రాసెస్డ్ చేసిన ఆహారాలను తీసుకోవడం మానేయాలి. అలాగే పంచదారను, పంచదారతో చేసిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా పొట్ట మరియు ప్రేగు ఆరోగ్యం దెబ్బతింటుంది. వాపు, నొప్పి వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక శీతలపానీయాలు, పేస్ట్రీ, స్వీట్స్ వంటి వాటిని తీసుకోవడం తగ్గించాలి. నూనెలో వేయించిన ఆహారాలను చాలా మంది ఇష్టంగా తింటారు. కానీ వీటిలో అనారోగ్య కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి ప్రేగు ఆరోగ్యాన్ని, పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. జీర్ణ సమస్యలతో పాటు కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇతర ఆరోగ్యసమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే తరుచూ మాంసాన్ని తీసుకోవడం వల్ల కూడా ప్రేగు ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఇందులో ప్రోటీన్ ఉన్నప్పటికి తరుచూ తీసుకోవడం ప్రేగులకు అంత మంచిది కాదు. దీని వల్ల కడుపులో మంట, పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాంసానికి బదులుగా గుడ్లు, చేపలు, మొక్క ఆధారిత ప్రోటీన్ వంటి వాటిని తీసుకోవాలి. అదే విధంగా కృతిమ స్వీటెనర్లు కూడా పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. వీటిని వాడడం వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. కనుక తేనె వంటి సహజ సిద్ద ఆహారాలను వాడడం మంచిది. ఇక ఆల్కహాల్ కూడా పొట్టలో ఉండే బ్యాక్టీరియా యొక్క సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి జరుగుతాయి. కనుక మద్యాన్ని కూడా చాలా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. మద్యాన్ని తీసుకున్నప్పటికి హాని కలగకుండా ఉండడానికి గానూ నీరు, హెర్బల్ టీ వంటి వాటిని ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే కెఫిన్ తీసుకోవడం మంచిదే అయినప్పటికి ఇది అదుపులో ఉండడం చాలా అవసరం.
కెఫిన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను సూచిస్తుంది. పొట్టలో బ్యాక్టీరియా యొక్క సమతుల్యత దెబ్బతింటుంది. గుండెలో మంటతో పాటు ఇతర జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని రకాల వంటకాల్లో అధిక ప్రక్టోజ్ కార్న్ సిరప్ ను కూడా వాడుతూ ఉంటారు. ఇవి ప్రేగులోని బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఫలితంగా పేగు వాపు, మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక వీటికి కూడా దూరంగా ఉండాలి. ఈ విధంగా ఈ ఆహార పదార్థాలు మన పొట్ట ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని కుక వీటికి దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.