Thyroid Foods : ఈ 4 ఆహారాల‌ను తింటే చాలు.. థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది..!

Thyroid Foods : మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన గ్రంథుల‌ల్లో థైరాయిడ్ గ్రంథి కూడా ఒక‌టి. థైరాయిడ్ గ్రంథి మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌న శ‌రీరంలో జీవ‌క్రియ‌ల‌ను నియంత్రించ‌డంలో, శ‌రీర బ‌రువును, శ‌క్తిని నియంత్రించ‌డంలో, గుండె, మూత్రపిండాలు వంటి అవ‌య‌వాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో వాటి ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాల విధుల‌ను థైరాయిడ్ గ్రంథి నిర్వ‌ర్తిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. కానీ నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది హైపో థైరాయిడిజంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ స‌మ‌స్య బారిన ప‌డితే మ‌నం జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. అంతేకాకుండా హైపో థైరాయిడిజంతో బాధ‌ప‌డే వారు అల‌స‌ట‌, మ‌ల‌బ‌ద్ద‌కం, బ‌రువు పెర‌గ‌డం, చ‌ర్మం పొడిబార‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ హైపో థైరాయిడిజం స‌మ‌స్య అదుపులో ఉండాలంటే మందుల‌తో పాటు మ‌నం ఇప్పుడు చెప్పే ఆహారాల‌ను కూడా తీసుకోవాలి. ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మెరుగుప‌డుతుంది. అలాగే స‌మ‌స్య కూడా మ‌రింత తీవ్ర‌త‌రం కాకుండా అదుపులో ఉంటుంది.హైపో థైరాయిడిజంతో బాధ‌ప‌డే వారు తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హైపో థైరాయిడిజం కార‌ణంగా శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఇది గుండె జ‌బ్బుల‌కు కార‌ణ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. క‌నుక గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. ఇవి శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెండ‌చంతో పాటు గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాల‌ను కూడా త‌గ్గిస్తాయి.

Thyroid Foods take these 4 for better health
Thyroid Foods

ఈ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చేప‌ల‌ల్లో ఎక్కువ‌గా ఉంటాయి. మ‌ధ్యాహ్నం లేదా రాత్రి భోజ‌నంలో చేప‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల మ‌న శ‌రీరానికి త‌గినంత ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ల‌భిస్తాయి. అయితే ఈ చేప‌ల‌ను వీలైనంత వ‌ర‌కు ఉడికి తీసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. నూనెలో వేయించి తీసుకోకూడ‌దు. అదేవిధంగా థైరాయిడ్ గ్రంథి ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో బ్రెజిల్ న‌ట్స్, మ‌కాడ‌మియా న‌ట్స్, హ‌జెల్ న‌ట్స్ వంటివి ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ న‌ట్స్ ను స్నాక్స్ గా తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిలో సెలెనియం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథి ప‌నితీరును మెరుగుపర‌చ‌డంతో పాటు హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వంటి స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గిస్తుంది. ఇక హైపో థైరాయిడిజంతో బాధ‌ప‌డే వారిలో క‌నిపించే మ‌రో స‌మ‌స్య మ‌ల‌బ‌ద్ద‌కం.

ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌పడాలంటే ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే తృణ ధాన్యాల‌ను తీసుకోవాలి. వీటిలో ఉండే ఫైబ‌ర్ ప్రేగు క‌ద‌లిక‌ల‌ను పెంచి మ‌ల‌బద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది. ఇక హైపో థైరాయిడిజంతో బాధ‌ప‌డే వారు కొవ్వు త‌క్కువ‌గా ఉండే పెరుగును తీసుకోవాలి. పెరుగు వంటి పాల ఉత్ప‌త్తుల్లో అయోడిన్ ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథి పెరుగుద‌ల‌ను నివారించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. క‌నుక రోజూ ఒక క‌ప్పు కొవ్వు త‌క్కువ‌గా ఉండే పెరుగును తీసుకోవాలి. ఇలా పెరుగును ఒక క‌ప్పు మోతాదులో తీసుకోవ‌డం వల్ల థైరాయ‌డ్ గ్రంథి చ‌క్క‌గాప‌ని చేయ‌డానికి అవ‌స‌ర‌మ‌య్యే అయోడిన్ ల‌భిస్తుంది. ఈ విధంగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల హైపో థైరాయిడిజం స‌మ‌స్య నుండి అలాగే దాని వ‌ల్ల ఎదుర‌య్యే ఇత‌ర స‌మ‌స్యల నుండి చాలా సుల‌భంగా బయ‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts