Jaggery Halwa : మనం బెల్లంతో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బెల్లంతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే బెల్లం కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బెల్లంతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో బెల్లం హల్వా కూడా ఒకటి. బెల్లం, మైదాపిండి కలిపి చేసే ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. చాలా సులభంగా ఎవరైనా ఈ హల్వాను తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉండే ఈ బెల్లం హల్వాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – అర కప్పు, నీళ్లు – అర కప్పు, బెల్లం తురుము – ఒకటిముప్పావు కప్పు, నెయ్యి -అర కప్పు, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన జీడిపప్పు ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్.
బెల్లం హల్వా తయారీ విధానం..
ముందుగా కళాయిలో మైదాపిండిని వేసి చిన్న మంటపై 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఈ పిండిని జల్లెడలో వేసి జల్లించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో అర కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత కళాయిలో బెల్లం తురుము, అర కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత దీనిని వడకట్టి మరలా కళాయిలో వేసుకోవాలి. ఈ బెల్లం మిశ్రమాన్ని 5 నుండి 10 నిమిషాల పాటు మరిగించిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న మైదాపిండి మిశ్రమాన్ని మరోసారి కలుపుకుని బెల్లం మిశ్రమంలో వేసుకోవాలి. దీనిని చిన్న మంటపై దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించాలి. బెల్లం మిశ్రమం దగ్గర పడిన తరువాత మధ్య మధ్యలో 1 లేదా 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి.
ఇలా అరకప్పు నెయ్యని పూర్తిగా వేసుకున్నతరువాత కొద్ది సమయానికి హల్వా నెయ్యిని వదలడం మొదలవుతుంది. అలాగే హల్వా కళాయికి అంటుకోకుండా వేరవుతుంది. ఇప్పుడు యాలకుల పొడి, జీడిపప్పు పలుకులు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ హల్వాను నెయ్యి రాసుకున్న గిన్నెలో వేసి పైన సమానంగా చేసుకోవాలి. తరువాత పైన జీడిపప్పు పలుకులతో గార్నిష్ చేసుకోవాలి. ఈ హల్వా పూర్తిగా చల్లారిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని మనకు కావల్సిన ఆకారంలో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం హల్వా తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా చాలా సులభంగా బెల్లంతో హల్వాను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.