Castor Oil : జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. ఇందు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే వివధ రకాల నూనెలను, షాంపులను, హెయిర్ డై లను వాడుతూ ఉంటారు. వీటి కోసం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. వీటిని వాడడానికి బదులుగా కేవలం ఆముదం నూనెను ఉపయోగించి మనం నల్లని, ఒత్తైన జుట్టును పొందవచ్చు. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం అనే నానుడి మనకు వాడుకలో ఉంది. కానీ ఔషధ గుణాల పరంగా చూసుకుంటే ఆముదం చెట్టే మహా వృక్షం. ఈ చెట్టులో ప్రతి భాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీనిని సంస్కృతంలో ఏరండా, వర్థమాన్ అని పిలుస్తారు.
పూర్వ కాలంలో ఆముదం నూనెను వంటల తయారీలో కూడా ఉపయోగించే వారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో దీనిని వంటల తయారీలో ఉపయోగిస్తున్నారు. ఆముదంలో ఉండే ఔషధ గుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే. పక్షవాతం, కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, గడ్డలు ఇలా అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఆముదం ఎంతో ఉపయోగపడుతుంది. వీటితోపాటు మనకు వచ్చే అన్ని రకాల జుట్టు సమస్యలను తగ్గించి జుట్టును నల్లగా, ఒత్తుగా, పొడుగ్గా పెరిగేలా చేయడంలో ఆముదం నూనె దివ్య ఔషధంలా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఆముదం నూనె చిక్కగా, జిగురుగా ఉంటుంది. ఎటువంటి సువాసనను కలిగి ఉండదు. కనుక దీనిని వాడడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ వారానికి ఒక్కసారైనా ఆముదం నూనెను జుట్టుకు బాగా పట్టించి గోరు వెచ్చటి నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది. మన జుట్టుకు ఆముదం నూనె కండిషనర్ గా కూడా పని చేస్తుంది. తలనొప్పితో బాధపడుతున్నప్పుడు మనం తరచూ ఉపయోగించే నూనెలో ఒక టేబుల్ స్పూన్ ఆముదం నూనె వేసి కలిపి వెంట్రుకల కుదుళ్లకు పట్టేలా బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉండే వేడి తగ్గుతుంది. తలనొప్పి, కళ్ల మంటలు కూడా తగ్గుతాయి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం, జుట్టు చివర్లు చిట్లడం వంటి సమస్యలు తగ్గుతాయి. జుట్టు సమస్యలు తగ్గి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
బయట దొరికే షాంపులను, నూనెలను, కండిషనర్ లను వాడడానికి బదులుగా ఆముదం నూనెను ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్పభ్రావాలు లేకుండా జుట్టు సమస్యలన్నీ తగ్గి నల్లని, ఒత్తైన జుట్టును మనం సొంతం చేసుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.